ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గృహ, రుణ వడ్డీ రేట్లు తగ్గడంతో, రుణాలు తీసుకుని ఫ్లాట్లు, విల్లాలు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వీటన్నింటికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. నగరం చుట్టూ వివిధ కొత్త ప్రాజెక్టులు వస్తుండడం, ప్రభుత్వాలు కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తుండడంతో, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
కొంపల్లి వైపు ఐటీ సంస్థల ఏర్పాటు, ఉప్పల్ వైపు మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయాలు, విజయవాడ, బెంగుళూరు జాతీయ రహదారి వైపు లాజిస్టిక్ పార్కులు, ఇలా నగరంలో నలువైపులా అభివృద్ధి ఊపందుకోవడంతో నగరానికి వలసలు పెరిగాయి. ఇప్పటికే ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టూ పక్కల ప్రాంతాలలో పలు కంపెనీల విస్తరణతో చుట్టూ పది కిలోమీటర్ల వరకు గృహ నిర్మాణం ఊపందుకుంది. కొండాపూర్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. ఎల్బీ నగర్ ప్రాంతానికి మెట్రో సౌకర్యం రావడంతో ఈ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో డిమాండ్ ఊపందుకుంది. అటు ఉప్పల్ వైపు కూడా మెట్రో రాకతో చాలా మంది ఇంటరెస్ట్ చూపుతున్నారు.