ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ముంబయిలోని ఆయన ఇంటికి నిన్న రాత్రి అధికారులు చేరుకున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది ఎస్ బ్యాంక్ అధికారులపై అక్రమ నగదు చలామణి(పీఎంఎల్ఏ) కింద ఆరోపణలు ఉన్నాయి.
అక్రమాలు..!
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. ఇందులో కపూర్ పాత్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంపై ఆయనకు పలు ప్రశ్నలు సంధించినట్లు అధికారులు తెలిపారు. మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
భార్య ఖాతాలోకి..!
సదరు సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా వారి నుంచి ఆయన కొంత సొమ్ము పొందారన్న అభియోగాలు ఉన్నాయి. ఆయన భార్య ఖాతాలోకి అవి చేరినట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్ బ్యాంకు ప్రస్తుతం చేరుకున్న పరిస్థితికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ కపూర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పాలనపరమైన సమస్యలు..
ఎస్ బ్యాంక్‌లో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న తెలిపారు. 2017 నుంచీ ఎస్ బ్యాంకును ఆర్‌బీఐ పరిశీలిస్తోందని స్పష్టంచేశారు. పాలనపరమైన సమస్యలు, తప్పుడు ఆస్తుల వర్గీకరణను గుర్తించినట్లు, బలహీనతలనూ చూసిందని వెల్లడించారామె.
బ్యాంకులో యాజమాన్యాన్ని మార్చాలని ఆర్‌బీఐ భావిస్తోందని.. ఈ కారణాలతోనే మారటోరియం విధించినట్లు తెలిపారు సీతారామన్. ఈ తరుణంలో కపూర్ ఇంట్లో సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి:ఎస్ బ్యాంక్ సంక్షోభంపై ఎవరెవరు ఏమన్నారంటే..