ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రానా కపూర్‌ను అక్రమ నగదు చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ అరెస్టు చేసింది. ఆయనను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తులో భాగంగా ఆయనను కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి అడగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎస్ బ్యాంకు సంక్షోభంలో కీలక పాత్రధారి అయిన ఆయనను ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే అతను దర్యాప్తునకు సహకరించడం లేదని వారు తెలిపారు.
శుక్రవారం రాత్రి రానా కపూర్ నివాసంలో తనిఖీలు చేపట్టిన ఈడీ.. తరువాత ఆయనను 20 గంటలకు పైగా విచారించింది. మరిన్ని సాక్ష్యాలు, సమాచారం సేకరించేందుకుగాను శనివారం దిల్లీ, ముంబయిల్లోని ఆయన ముగ్గురు కూతుళ్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. కపూర్ భార్య బిందు, కుమార్తెలు రాఖీ కపూర్ టాండన్, రోష్నీ కపూర్, రాధా కపూర్లకు కూడా ఈ అక్రమాలతో సంబంధం ఉన్నట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు.