Economic Recovery: 'వ్యవసాయం భారత దేశానికి పునాది. ఈ రంగం ఇచ్చిన ఊతం వల్లే 2021-22లో ఆర్థిక పునరుత్థానం వేగం పుంజుకొంది'.. దేశంలోని పరిస్థితులపై విడుదల చేసిన నెలవారీ విశ్లేషణ నివేదికలో కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం ఇది. వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం 4.5శాతం వృద్ధిని నమోదు చేసింది. రబీలో నూనె గింజల సాగు క్రితం సారి కంటే 29.2శాతం పెరిగింది. ఎరువుల విక్రయాలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ట్రాక్టర్ అమ్మకాలు గతేడాది కంటే 7శాతం పెరిగాయి. 2021-22 ఖరీఫ్, రబీ పంటకు కనీస మద్దతు ధర వృద్ధి చెందింది. బియ్యం సేకరణ వల్ల 49 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. తద్వారా గ్రామీణ ఆదాయం పెరిగింది.
అన్ని కొలమానాల్లోనూ పురోగతి: ప్రస్తుతం దేశ ఆర్థిక పురోగతి అన్ని కొలమానాల్లోనూ సానుకూలత కనిపిస్తోంది. మొత్తం 22 హైఫ్రీక్వెన్సీ సూచీల్లో 19 సూచీలు 2021 అక్టోబరు, నవంబరు నెలల్లో మహమ్మారి ముందునాటి (2019లో ఇదే నెలల్లో) పరిస్థితులను దాటేశాయి. ఒమిక్రాన్ ప్రపంచ ఆర్థిక పురోగతికి ముప్పుగా పరిణమించవచ్చనే ఆందోళన ఉన్నప్పటికీ దాని తీవ్రత తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సినేషన్ పెరిగే కొద్దీ కొత్త రకం వైరస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండో త్రైమాసిక వృద్ధిరేటు 8.4 శాతం: 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రియల్ జీడీపీ 8.4శాతం వృద్ధి రేటు సాధించింది. 2019-20 ఇదే త్రైమాసికంతో పోలిస్తే రికవరీ 100శాతానికి మించి జరిగింది. వరుసగా నాలుగు త్రైమాసికాలు (2021 3, 4 త్రైమాసికాలు, 2022లో 1, 2 త్రైమాసికాలు) వృద్ధి నమోదుచేసిన దేశాల్లో భారత్ ఒకటి. సేవల రంగం పుంజుకోవడం, తయారీ రంగంలో పూర్తి రికవరీ కనిపించడం, వ్యవసాయ రంగంలో సుస్థిర వృద్ధి నమోదువల్లే ఇది సాధ్యమైంది.