తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక మాంద్యం 2008 X 2020.. ఏంటి తేడా? - 2008 2020 ఆర్థిక మాంద్యం

ప్రపంచానికి మరో ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉంది. 2008 నాటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. రెండింటి మధ్య సారుప్యతలున్నట్లే.. స్పష్టమైన తారతమ్యాలూ ఉన్నాయి. 2008 ఆర్థిక మాంద్యానికి 2020లోఉన్న ఆర్థిక పరిస్థితులకు ఉన్న తేడా ఏంటి? ఎందుకు ఈ రెండు సంక్షోభాలను వేర్వేరుగా చూడాలి? 2008 నాటి పరిష్కార మార్గాలు ఇప్పుడు అమలు చేస్తే ఏమవుతుంది?

Economic Crisis: Why 2020 is not 2008
ఆర్థిక మాంద్యం 2008, 2020

By

Published : Apr 5, 2020, 6:34 AM IST

2008 ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపేసింది. బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.

ఇప్పుడు మళ్లీ అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం నాటి రోజులను ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచంపై కోరలు విప్పుతున్న నేపథ్యంలో అన్ని దేశాలపై మాంద్యం ప్రభావం పడే అవకాశం ఉంది.

వర్తమానాన్ని ఇటీవలి కాలంతో పోల్చడం మానవ నైజం. అంతకుమించి ఇప్పుడు నెలకొన్న పరిస్థితులకు సరైన పరిష్కారం కనుగొనేందుకు గతంతో పోల్చుకోవడం కూడా అవసరమే. అయితే 2008 మాంద్యంతో పోలిస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది. రెండు పరిస్థితుల మధ్య భేదభావాలు గ్రహించి ఓ విధానపరమైన నిర్ణయానికి రావడం ముఖ్యం.

అమెరికా కేంద్రంగా మాంద్యం

2008లో వాల్ స్ట్రీట్ బ్రోకరేజీ సంస్థ 'లెహ్మాన్ బ్రదర్స్' దివాలా తీయడం వల్ల అమెరికా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం మొదలైంది. వివిధ దేశాల మధ్య బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవల రంగాలకున్న అనుసంధానం కారణంగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది భారీ ప్రభావం చూపింది.

అనంతరం ఇది అన్ని రంగాల సంక్షోభంగా మారింది. గ్లోబల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. వందల కోట్ల డాలర్ల మదుపర్ల సంపద ఇట్టే ఆవిరైంది. వినియోగదారుల డిమాండ్​పై కోలుకోలేని ప్రభావం పడింది. ఈ పరిస్థితులన్నీ ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి. 1929 తర్వాత ఎప్పుడూ చూడని ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచాన్ని నెట్టేశాయి.

చైనా కేంద్రంగా వైరస్

ఇదేవిధంగా కొవిడ్-19 వైరస్ చైనా కేంద్రంగా ఉద్భవించింది. ఇది ప్రపంచాన్ని ఆరోగ్య అత్యయిక స్థితిలోకి పడవేసింది. ఈ వైరస్​కున్న అధిక వ్యాప్తి చెందే గుణం కారణంగా ప్రపంచదేశాలన్నీ తమ సరిహద్దులు మూయక తప్పలేదు. కోట్లాది మందిని నిర్బంధంలో ఉంచి... రాష్ట్రాలు, దేశాలు లాక్​డౌన్​ విధించడమే శరణ్యమైంది.

ఇవన్నీ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడానికి కారణమయ్యాయి. ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తూ లక్షలాది మంది ప్రజల జీవనశైలిపై ఎనలేని ప్రభావం చూపించాయి.

ఇదీ సారూప్యత!

ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థను మోకాళ్లమీద కూర్చోబెట్టగల శక్తి ఉందని గ్రహించడం ద్వారా 2008, 2020 ఆర్థిక సంక్షోభాల మధ్య సారూప్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది.

అయితే 2008లో సంభవించిన ఆర్థిక మాంద్యం మాదిరిగా ఇప్పుడు కూడా అదే తరహా విధానపర నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదకరమైన ప్రతిఘటన ఏర్పడే అవకాశం ఉంది. సమస్యను బట్టి పరిష్కారం ఉంటుంది గనుక ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

ఎలా భిన్నం?

భవిష్యత్తులో ఏదైనా విధానపర చర్యలు తీసుకోవడానికి ఈ రెండు సంక్షోభాల మధ్య ఉన్న వ్యత్యాసాలు తెలుసుకోవడం అత్యావశ్యకం.

రెండు సందర్భాల్లో ఏర్పడిన ఆర్థిక మందగమన విధానం మొదటి తేడా... 2008 మాంద్యం సమయంలో తొలుత బ్యాంకింగ్ రంగాన్ని ఆవహించిన సంక్షోభం.. నిదానంగా వాస్తవ ఆర్థిక వ్యవస్థకు బదిలీ అయింది.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సంక్షోభం అనే పిడుగు ఆర్థిక వ్యవస్థపై ఒక్కసారిగా పడింది. కోట్లాది మందిని లాక్​డౌన్ లోకి నెట్టేస్తూ.. ఆర్థిక వ్యవస్థ స్తంభించేలా చేసింది.

రెండో తారతమ్యం

వినియోగ డిమాండ్ మందగించడం రెండో భేదం. ఇది కూడా రెండు వేర్వేరు కారణాల వల్ల ఏర్పడ్డాయి. 2008లో బ్యాంకింగ్ రంగం సంక్షోభానికి గురికాగా.. ఇప్పుడు కొవిడ్-19 వ్యాధి కారణంగా వినియోగ డిమాండ్ నెమ్మదించింది. ఈ రెండూ కూడా పూర్తి విరుద్ధ మార్గాల్లో పరిష్కరించాల్సినవే.

ఆర్థిక వ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు 2008 ఆర్థిక మాంద్యం సంభవించింది. కానీ ఇప్పుడు.. ఇదివరకే ఉన్న మందగమనాన్ని ప్రస్తుత పరిస్థితులు మరింత వేగిరం చేశాయి.

ద్రవ్య లభ్యత

మరో వ్యత్యాసమేంటంటే ద్రవ్య పరిస్థితులు. 2008లో ద్రవ్య లోటు బ్యాంకింగ్ వ్యవస్థ అంతటా విస్తరించింది. దీంతో మూలధన సమీకరణ కష్టతరంగా మారిపోయింది.

ప్రస్తుతమయితే బ్యాంకుల్లో ద్రవ్య లభ్యత అధికంగానే ఉంది. ద్రవ్య లోటు అన్న మాట లేదు. ఒక్కసారి లాక్​డౌన్ ముగిసిపోయితే బ్యాంకింగ్ రంగం తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. భవిష్యత్తుకు ఇదో సానుకూలాంశం.

చివరగా...

2008లో ఆర్థిక సంక్షోభం వల్ల తలెత్తిన పరిస్థితులు, కొవిడ్-19 వంటి విపత్కర వ్యాధి కారణంగా ఏర్పడ్డ అనిశ్చితులకు మధ్య ఉన్న తేడాలను గమనించి, ప్రపంచ సంక్షోభం నాటి పరిష్కారాలు కాకుండా విధాన నిర్ణేతలు సరైన దారిని ఎంచుకోవాలి. అప్పుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరో మాంద్యంలో పడవేయకుండా జాగ్రత్తపడినవారవుతాం.

(రచయిత-డా. మహేంద్ర బాబు కురువ, సహాయ ఆచార్యులు, హెచ్.ఎన్.బీ గడ్వాల్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉత్తరాఖండ్)

ఇదీ చదవండి:'2008 మాంద్యంకన్నా తీవ్రంగా కరోనా సంక్షోభం'

ABOUT THE AUTHOR

...view details