మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఒక ఇండెక్స్ ఫండ్‌తో మొదలు పెట్టినట్లయితే అలవాటు, అవగాహన ఏర్పడతాయి.
సాధారణంగా చాలా మంది 22-25 ఏళ్ల వయసులో సంపాదన మొదలుపెడతారు. ఆ వయసులో ఎక్కువ బాధ్యతలు ఉండవు. తల్లిదండ్రులు కూడా వారిపై ఆర్థిక ఆంక్షలు విధించరు. దీంతో చేతిలో మిగులు డబ్బు ఉంటుంది. ఆ వయసులో వారికి జీవితం గురించి అవగాహన గానీ, అనుభవంగానీ వుండవు. చుట్టూరా ఎన్నో ఆకర్షించే వస్తువులు, మొబైల్ ఫోన్లు, బైకులు, ఫ్యాషన్ దుస్తులు, స్నేహితులతో బయట ఖరీదైన చిరుతిళ్లు, ఇలా ఎన్నో కనిపిస్తాయి. కొంత వరకు ఇవి ఉండాలి. లేకపోతే ఆ వయసు, అవకాశాలు మళ్లీ మళ్లీ రాకపోవచ్చు. అయితే ఇక్కడ నుంచే వారి భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తారు.
ఇక్కడ నుంచి 30-35 ఏళ్లపాటు సంపాదించే వయసు, ఆ తరువాత హాయిగా, ఆనందంగా కుటుంబ సభ్యులతోపాటు జీవించడానికి కావలసిన డబ్బును జమ చేసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ కుటుంబ బాధ్యతలైన పిల్లల చదువులు, వారి ఆరోగ్యం, ఇల్లు కొనుగోలు చేయడం, సామాజిక బాధ్యతలు వంటి ఖర్చులు వల్ల ఎక్కువ మొత్తం వీటికే సరిపోతుంది. మిగులు చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ఆధునిక వైద్య పరిజ్ఞానం వలన చికిత్స ఖర్చుతో కూడుకున్నప్పటికీ, ఆయుః ప్రమాణం కూడా పెరుగుతుంది.
అందుకోసం జీవించి ఉన్నంత వరకు సరిపడా సొమ్మును దాచుకోవాలి. అయితే ఇది ఎంత మొత్తం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అప్పటి వారి ఆరోగ్య పరిస్థితి, జీవన విధానం, జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి పొదుపు/మదుపు ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగాలి.
మన ఆర్థిక జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం:
మన ఆదాయంలో 30-40 శాతం నెలవారీ ఖర్చులకు కేటాయించాలి. మరొక 30 శాతం స్వల్పకాలిక (అంటే రాబోయే 3 ఏళ్లకు) అవసరాలకోసం పొదుపు చేయాలి. మిగిలిన 30-40 శాతాన్ని దీర్ఘకాలిక (3 ఏళ్లకు పైబడిన) అవసరాలకోసం మదుపు చేయాలి.
టర్మ్ జీవిత బీమా:తనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆర్థిక భరోసా కోసం 'టర్మ్ జీవిత బీమా' తీసుకోవాలి. తన వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండేటట్లు, అలాగే 60ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగించాలి. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందొచ్చు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సమీక్షించి, అవసరమైన అదనపు బీమాను తీసుకోవాలి.
డిపాజిట్ ఖాతాలు
పొదుపు ఖాతాతోపాటు, రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరవాలి. దీనివల్ల మొదటినుంచి పొదుపు ఒక అలవాటుగా మారుతుంది. ఏడాది తరువాత ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిది. ఈ సొమ్ము స్వల్పకాలిక పనులకు ఉపయోగపడతాయి. 7 శాతం వరకు వడ్డీ ఆశించవచ్చు.