రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ తొలిడోసు సరఫరా ప్రారంభించినట్టు డా.రెడ్డీస్ లేబొరేటరీస్ మంగళవారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా తాము ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రులకు వీటిని పంపుతున్నట్టు తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పుత్నిక్-వి టీకా లభ్యత గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వేరియంట్ ఏదైనా..
కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు మాత్రం టీకాల పనితీరుకు ఓ సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికే వినియోగిస్తోన్న టీకాలు కొన్ని వేరియంట్లను ఎదుర్కోగలుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. తాజాగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లను తటస్థీకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు తొలుత వుహాన్‌లో వెలుగుచూసిన వైరస్ స్ట్రెయిన్ ఆధారంగా రూపొందించారు. కానీ, రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న వైరస్, ప్రమాదకర వేరియంట్లుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ఫా, బీటా, గామాతో పాటు అత్యంత ప్రమాదకరమైందిగా భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ను తటస్థీకరించడంలో స్పుత్నిక్-వి మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్ వెల్లడించింది. ఇందుకోసం స్పుత్నిక్ టీకా తీసుకున్నవారి రక్త నమూనాలను సేకరించి పరిశీలించినట్లు తెలిపింది.