రక్షణ విభాగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిస్తూ.. ప్రస్తుత విధానాల్లో మార్పులు చేయాలని డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) త్వరలోనే కేంద్ర కేబినెట్‌ను కోరనున్నట్టు సమాచారం. స్వయంచాలక మార్గం ద్వారా రక్షణ రంగంలోకి విదేశీ సంస్థలను ఆకర్షించడానికి ఇది ఉపయోగపడుతుందని డీపీఐఐటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రక్షణశాఖతో డీపీఐఐటీ ఇప్పటికే చర్చించినట్టు సమాచారం.
అయితే రక్షణ సామగ్రి తయారీలో 74 శాతం ఎఫ్డీఐకు అనుమతినిచ్చే విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మే నెలలోనే ప్రకటించారు. కరోనా సంక్షోభంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.