తెలంగాణ

telangana

ETV Bharat / business

'టెల్కోలు ఏజీఆర్ చెల్లించకపోయినా చర్యలు తీసుకోవద్దు'

ఏజీఆర్ బకాయిలు చెల్లించకపోయినా టెలికాం సంస్థలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని టెలికాం శాఖ.. సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. తమ పిటిషన్లపై సుప్రీం విచారణ జరిగే వరకు బకాయిలు చెల్లించలేమని ఎయిర్​టెల్​, వొడాఫోన్-ఐడియాలు చేతులెత్తేసిన నేపథ్యంలో డీఓటీ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ జియో మాత్రం ఏజీఆర్ బకాయిలు చెల్లించినట్లు ప్రకటించింది.

DoT directs officials not to take act against telcos on AGR non-payment
టెల్కోలు 'ఏజీఆర్​' చెల్లించకపోయినా చర్యలు వద్దు: డీఓటీ

By

Published : Jan 23, 2020, 6:57 PM IST

Updated : Feb 18, 2020, 3:39 AM IST

టెల్కోలు... సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలు చెల్లించడంలో విఫలమైనా, వాటిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకొవద్దని టెలికాం శాఖ లైసెన్సింగ్ ఫైనాన్స్​ పాలసీ వింగ్... సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీచేసింది. ఆదాయ వ్యవహారాలు చూసే అన్ని డీఓటీ విభాగాల సభ్యుల (ఫైనాన్స్) ఆమోదం తరువాత ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి

గడువు కావాలి..

సుప్రీం కోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు.. ఏజీఆర్​ బకాయిలు చెల్లించలేమని టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​, వొడాఫోన్-ఐడియాలు... డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికాంకు (డీఓటీ)కు తెలిపాయి.

బకాయిలు చెల్లిస్తాం: జియో

రిలయన్స్ జియో మాత్రం 2020 జనవరి 31 వరకు అన్ని ఏజీఆర్​ బకాయిలు తీరుస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.195 కోట్లు... డీఓటీకి చెల్లించినట్లు స్పష్టం చేసింది.

"రిలయన్స్ జియో ఏజీఆర్​ బకాయిల కోసం రూ.195 కోట్లు చెల్లించింది. ఇందులో 2020 జనవరి 31 వరకు కంపెనీ ముందస్తుగా చెల్లించిన డబ్బు కూడా ఉంది."
- రిలయన్స్​ జియో వర్గాలు

సుప్రీం గత తీర్పు ఇది..

టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సిందేనని అక్టోబర్​ 24న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. బకాయిల చెల్లింపునకు జనవరి 23ను గడువుగా విధించింది అత్యున్నత న్యాయస్థానం.

ఈ తీర్పును సమీక్షించాలని టెలికాం సంస్థలు ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియాలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఇక్కడా టెల్కోలకు చుక్కెదురైంది. ఈ విషయంపై పునఃసమీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది కోర్టు. ఈ తీర్పుతో టెలికాం సంస్థలు డీఓటీకి ఏజీఆర్​ బకాయిల చెల్లింపు అనివార్యమైంది.

గడువు పెంచండి..

రివ్యూ పిటిషన్ బెడిసికొట్టిన తర్వాత బకాయిల చెల్లింపునకు గడువు పెంచాలని కోరుతూ టెలికాం సంస్థలు మరోసారి సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్​పై వచ్చే వారం వాదనలు విననుంది సుప్రీం ధర్మాసనం.

టెలికాం సంస్థల బకాయిలు ఇవి..

ఏజీఆర్​ వివాదంలో.. డీఓటీకీ ఎయిర్​టెల్​ రూ.35,586 కోట్లు, వొడాఫోన్​-ఐడియా రూ.52,039 కోట్లు చెల్లించాల్సి ఉంది. అన్ని టెలికాం సంస్థలు కలిపి రూ.1.47 లక్షల కోట్ల మేర బకాయిలు పడ్డాయి.

ఇదీ చూడండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలివే...

Last Updated : Feb 18, 2020, 3:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details