డిజిటల్ చెల్లింపుల కోసం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో దేని ప్రత్యేకత దానిదే. కొన్ని సులువుగా చెల్లింపులను చేసేందుకు ఉపయోగపడితే.. మరికొన్ని వాటిని వాడుకున్నందుకు మనకు అదనంగా రివార్డు పాయింట్లనూ అందిస్తాయి. ఇలాంటి వాటిలో చెప్పుకోవాల్సినవి క్రెడిట్ కార్డుల గురించే.. చేతిలో డబ్బు లేకున్నా.. కొంతకాలం పాటు ఖర్చులకు వెసులుబాటు కల్పిస్తాయివి. దీంతో పాటు ప్రతి కొనుగోలు వెంటా ఉచితంగా కొన్ని ప్రయోజనాలనూ అందిస్తుంటాయి. అందులో నగదు వెనక్కి, రివార్డు పాయింట్లలాంటివి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నిత్యం ఆన్‌లైన్ కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు వాడేవారికి ఈ ప్రయోజనాలు కొన్ని వేల రూపాయలకు చేరతాయని చెప్పొచ్చు.
డబ్బు ఆదా..
మీ దగ్గరున్న క్రెడిట్ కార్డులను బట్టి, లావాదేవీల సంఖ్యను బట్టి మీకు వచ్చే రివార్డు పాయింట్లు ఆధారపడి ఉంటాయి. ఈ రివార్డు పాయింట్లు మీరు డబ్బును ఆదా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ పాయింట్లను పెంచుకునేందుకు మీరు చేయాల్సిందల్లా.. ఆన్‌లైన్‌లో ఏ వస్తువు కొన్నా.. దానికి క్రెడిట్ కార్డుతో ఎన్ని పాయింట్లు వస్తున్నాయో ఒకసారి చూసుకోవడమే. ప్రస్తుతం కొన్ని కార్డు సంస్థలు పలు ఇ-కామర్స్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకొని, ప్రత్యేక రాయితీలనూ ఇస్తున్నాయి. దీంతోపాటు రివార్డు పాయింట్లనూ అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు అందిస్తోన్న క్రెడిట్ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ప్రతి రూ.100కూ 5 రివార్డు పాయింట్లను అందిస్తోంది. దీంతోపాటు కొన్నింటికి ప్రతి రూ.100 కొనుగోలుకు ఒక పాయింటును అదనంగా ఇస్తోంది. తాను ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసే వారికి ప్రతి రూ.100 ఖర్చు పెడితే.. 10 పాయింట్లనూ అందిస్తోంది. దీనివల్ల మీ కొనుగోళ్లు పెరుగుతున్న కొద్దీ.. పాయింట్లూ జమ అవుతుంటాయి.
ఇతర మార్గాల్లో చెల్లిస్తే..
క్రెడిట్ కార్డులతోపాటు ఆన్‌లైన్ కొనుగోళ్లకు నగదు, యూపీఐలనూ వాడుకోవచ్చు. దీంతోపాటు నెట్ బ్యాంకింగ్‌నూ ఉపయోగించుకోవచ్చు. కానీ, ఈ మార్గాల్లో చెల్లించడం ద్వారా ఎలాంటి రివార్డు పాయింట్లూ అందవు. ఇలా చెల్లించినప్పుడు రాయితీల్లాంటివీ అందకపోవచ్చు. వీటన్నింటికన్నా.. కాస్త ప్రయోజనం ఉండేది డెబిట్ కార్డుతోనే. అయినప్పటికీ ఇవీ పరిమితంగానే ఉంటాయి. కొన్ని సంస్థలు అందించే ప్రీమియం క్రెడిట్ కార్డు ద్వారా మరిన్ని అదనపు పాయింట్లు లభిస్తాయి. కానీ, వీటికి వార్షిక రుసుము ఉంటుంది.