తెలంగాణ

telangana

ETV Bharat / business

'బిట్​కాయిన్​తో రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతాం అనుకోకండి' - టెస్లా క్రిప్టోకరెన్సీ

క్రిప్టో కరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆసక్తి పెరుగుతోంది. బిట్​కాయిన్ (bitcoin) సహా వివిధ డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊహాజనిత కరెన్సీ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ సమయంలో ధనవంతులు అయ్యేందుకు దీనిని ఓ సాధనంగా చూడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

bitcoin
బిట్‌కాయిన్

By

Published : Oct 27, 2021, 6:19 PM IST

  • 2020 అక్టోబర్​: 1 బిట్​కాయిన్​ = 13,000 డాలర్లు
  • 2021 అక్టోబర్​: 1 బిట్​కాయిన్​ = 67,000 డాలర్లు

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రెట్లు పెరిగింది బిట్​కాయిన్​ విలువ. అదీ ఏడాదిలోనే.

అతి తక్కువ కాలంలోనే ఇంతటి వృద్ధి సాధించడం చూస్తే.. బిట్​కాయిన్​ అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా కనిపిస్తోంది. బిట్​కాయిన్​ను నమ్ముకుంటే సులువుగా సంపన్నులు కావడం ఖాయమనిస్తోంది. ఇంతకీ.. ఇవన్నీ నిజమేనా? 'క్రిప్టోకరెన్సీ' ఎంతవరకు సురక్షితం? క్రిప్టోకరెన్సీలో పెట్టుబడిపై నిపుణులు ఏమంటున్నారు?

అలా చూడొద్దు..

గతకొన్నాళ్లుగా ఈ ఊహాజనిత కరెన్సీ విలువ పెరుగుతున్నప్పటికీ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని క్రిప్టోకరెన్సీ సేవలందించే 'వజీర్‌ఎక్స్' సంస్థ వ్యవస్థాపకుడు నిశ్చల్ శెట్టి సూచిస్తున్నారు. అతితక్కువ కాలంలో అధిక రాబడులనిచ్చే పథకాలుగా వీటిని భావించొద్దని హెచ్చరిస్తున్నారు. దీనికి ఉదాహరణగా.. ఏడాది కాలంలో బిట్​కాయిన్ ఎదుర్కొన్న హెచ్చుతగ్గులను ఓసారి గమనించాలంటున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్​లో దాదాపు 63వేల డాలర్లున్న బిట్​కాయిన్ విలువ.. జులై నాటికి 30వేల డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే క్రమంగా పెరుగుతూ.. ఈ నెల ప్రారంభంలో 43,700డాలర్లకు.. మంగళవారం నాటికి 63వేల డాలర్లకు చేరింది.

'బిట్' మాయ..

బిట్‌కాయిన్ విలువ అమాంతంగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ సహా.. కొందరు ప్రముఖులు క్రిప్టోకరెన్సీకి మద్దతు పలకడం కలిసొచ్చింది. ముఖ్యంగా తమ కార్ల కొనుగోళ్ల చెల్లింపులకు క్రిప్టోకరెన్సీని స్వీకరిస్తామంటూ మస్క్ చేసిన ప్రకటనతో బిట్‌కాయిన్‌ విలువ అమాంతం దూసుకెళ్లింది. ఇక అక్టోబరు 19న న్యూయార్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ప్రోషేర్స్‌ బిట్‌కాయిన్‌ స్ట్రాటజీ ఈటీఎఫ్‌ (బిటో)గా నమోదైన 'క్రిప్టోకరెన్సీ' 900 మిలియన్ డాలర్లకు పైగా ట్రేడ్ కావడం విశేషం. దీనితో 'బ్లాక్‌రాక్ కార్బన్ ఫండ్' తర్వాత మొదటి రోజే అత్యధికంగా ట్రేడయిన రెండో కొత్త ఈటీఎఫ్‌గా నిలిచింది.

'బిట్‌కాయిన్, ఆల్ట్‌కాయిన్‌ ధరల పెరుగుదల అనేది ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లలో ఊహాజనిత కరెన్సీపై పెరుగుతున్న ట్రేడింగ్ పరిమాణంతో ముడిపడి ఉంది' అని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ 'వజీర్‌ ఎక్స్' వ్యవస్థాపకుడు నిశ్చల్ శెట్టి తెలిపారు.

"క్రిప్టోకరెన్సీపై పెట్టుబడిదారులు ఆసక్తితో ఉన్నారనేందుకు తాజా గణాంకాలు సంకేతంగా నిలుస్తున్నాయి. మొత్తం మీద ఇది బిట్‌కాయిన్‌ భవిష్యత్​కు మంచి సంకేతం. నూతన పెట్టుబడిదారులు ఈ ట్రేడింగ్​లో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తుంది."

-నిశ్చల్ శెట్టి

మరోవైపు.. బిట్​కాయిన్ మార్కెట్ పట్ల భారతీయ పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిశ్చల్ శెట్టి హెచ్చరిస్తున్నారు. 'మార్కెట్ దూకుడుగా ఉన్నప్పటికీ.. అత్యాశకు గురికాకుండా ఉండటం ముఖ్యం' అని పేర్కొన్నారు. 'విలువ పెరుగుదల, దిద్దుబాటు అనేది మార్కెట్ చక్రంలో ఒక భాగం. రిస్క్ ఆధారంగా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం' అని శెట్టి స్పష్టం చేశారు. ఏదైనా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే ముందు సొంతంగా పరిశోధించాలని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details