పండగ సీజను అనంతరమూ వాహన విక్రయాల్లో వృద్ధి కొనసాగింది. డిసెంబరులో ప్రోత్సాహకర రీతిలో అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా దేశీయ వాహన దిగ్గజాలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ 20 శాతానికిపైగా వృద్ధితో ఆకట్టుకున్నాయి. మారుతీ మొత్తం అమ్మకాల్లో 20.2 శాతం, దేశీయ అమ్మకాల్లో 17.8 శాతం వృద్ధి లభించిది. ఈ సంస్థ మినీ కార్ల విభాగంలో 2019 డిసెంబరులో 23,883 అమ్మకాలు నమోదుకాగా.. కిందటి నెలలో 4.4 శాతం పెరిగి 24,927 వాహనాలకు చేరాయి.
స్విప్ట్, బాలెనో, డిజైర్ లాంటి మోడళ్లతో కూడిన కాంపాక్ట్ కార్ల విభాగ అమ్మకాలు 18.2 శాతం వృద్ధితో 77,641 వాహనాలుగా నమోదయ్యాయి. 2019 డిసెంబరులో ఈ తరహా కార్లను 65,673 వరకు మారుతీ విక్రయించింది. మధ్య తరహా సెడాన్ సియాజ్ అమ్మకాలు 28.9 శాతం క్షీణించి 1,270 వాహనాలకు పరిమితమయ్యాయి. విటారా బ్రెజా, ఎస్‌క్రాస్, ఎర్టిగా మోడళ్లతో కూడిన యుటిలిటీ వెహికల్స్ విభాగం అమ్మకాలు 8 శాతం పెరిగి 25,701 వాహనాలుగా నమోదయ్యాయి.