Dolo 650 Tablet: 'డోలో 650' అనేది బ్రాండు పేరు. మందు పారాసెట్మాల్. 650 ఎంజీ అనేది డోసు. బెంగుళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. వాస్తవానికి ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలందరికీ తెలిసిన పారాసెట్మాల్ బ్రాండ్లు వేరే ఉన్నాయి. అవి బహుళ జాతి ఫార్మా కంపెనీ జీఎస్‌కేకు చెందిన కాల్‌పాల్, క్రోసిన్ బ్రాండ్లు. ఆ తర్వాత దేశీయ కంపెనీలు కొన్ని పీ 650, పాసిమోల్, పారాసిప్, ఎక్స్‌టీపారా, సుమో ఎల్ బ్రాండ్ల పేరుతో ఈ మందును అపెక్స్, సిప్లా, ఇప్కా, టోరెంట్ వంటి దేశీయ కంపెనీలు అందిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలందరికీ తెలిసింది 'డోలో 650'నే. జ్వరం అనగానే పారాసెట్మాల్ వాడాలి, అనటానికి బదులు, 'డోలో 650' వేసుకో అనే మాట వస్తుంది.
కొవిడ్ సోకగానే కనిపించే మొదటి లక్షణం జ్వరం. అందుకే డోలో 650 వేసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇంకా యాంటీ- బయాటిక్, యాంటీ-హిస్టమిన్ మందులు, విటమిన్ ట్యాబ్లెట్లూ సూచిస్తున్నారనుకోండి. అయినప్పటికీ ప్రాథమిక ఔషధం 'డోలో650'నే అవుతోంది. ఈ బ్రాండుకు ఇంత అధిక ప్రజాదరణ లభిస్తుందని మేం కూడా అంచనా వేయలేదు- అంటారు మైక్రో ల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా.
Dolo 650 Dosage:
650 ఎంజీతో పారాసెట్మాల్ 500 ఎంజీ డోసు మాత్రమే అందుబాటులో ఉన్న తరుణంలో, 1993లో 'డోలో' పేరుతో 650 ఎంజీ డోసు పారాసెట్మాల్ ట్యాబ్లెట్‌ను మైక్రో ల్యాబ్స్ తీసుకొచ్చింది. దీని విజయానికి ఈ డోసే ప్రధాన కారణం. పారాసెట్మాల్ మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు... జ్వరాన్ని అదుపు చేయటానికి 500 ఎంజీ డోసు సరిపోవటం లేదని, కొంత అధిక డోసు అయితే మేలు- అనే అభిప్రాయం వైద్యుల నుంచి వ్యక్తమైంది. దాన్ని మైక్రో ల్యాబ్స్ అందిపుచ్చుకుంది. 650 ఎంజీ డోసులో ఈ మందు ఉత్పత్తి చేయటం కొంత కష్టమైనప్పటికీ, సొంత పరిశోధన- అభివృద్ధి ద్వారా దాన్ని సాధించింది.