కరోనా వైరస్ (కొవిడ్-19) విస్తరిస్తూ, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, సురక్షిత పెట్టుబడి సాధనం అయిన బంగారంపైకి పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని, భవిష్యత్తులో ధర గణనీయంగా పెరగవచ్చని బీఓఎఫ్‌ఏ (బ్యాంక్ ఆఫ్ అమెరికా) సెక్యూరిటీస్ విశ్లేషించింది. ''వచ్చే 18 నెలల వ్యవధిలో ఔన్సు బంగారం (31.10 గ్రాములు) ధర 3,000 డాలర్లకు చేరొచ్చు’’ అని ఈ సంస్థ తాజాగా ఒక నివేదికలో అభిప్రాయపడింది. కొవిడ్-19 వల్ల మదుపరుల్లో నష్ట భయం పెరిగిపోయింది. అందువల్ల బంగారానికి అనూహ్య గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది కనుక ఔన్సు బంగారం ధర 3,000 డాలర్లకు పెరగొచ్చు' అని ఈ సంస్థ విశ్లేషించింది.
అంతర్జాతీయ మార్కెట్లో
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1710 డాలర్లు పలుకుతోంది. ఇంతకు ముందు ఇదే సంస్థ వచ్చే ఏడాదిన్నర కాలానికి ఔన్సు బంగారం ధర 2,000 డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది. ఇప్పుడు దాన్ని సవరించింది. యూఎస్‌తో పాటు జీ-10 దేశాల్లో వడ్డీరేట్లు సున్నా శాతం కంటే కిందకు దిగిపోయే అవకాశం ఉందని, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో యూఎస్ జీడీపీ (స్థూల జాతీయ ఉత్పత్తి) 30% పతనం కావచ్చని, అదే విధంగా జపాన్ కూడా 21.8% పతనాన్ని నమోదు చేయవచ్చని విశ్లేషించింది. ప్రస్తుతం డాలర్ మారకపు విలువ రూ.76పైన ఉంది. బీఓఎఫ్‌ఏ అంచనాలకు అనుగుణంగా పసిడి విలువ పెరిగినపుడు, ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం లెక్కిస్తే... 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.73,000 కావాలి. నిజంగా అంత అవుతుందా- లేదా? అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే బంగారానికి ఎన్నడూ లేనంత గిరాకీ రాబోతోందని స్పష్టమవుతోంది. వాస్తవానికి బంగారం ధర ఎంతగా పెరిగితే, అంతగా ఆభరణాలు కొనుగోలు చేసే వారు తగ్గిపోతున్నారని ఆభరణాల విక్రయదార్లు పేర్కొంటున్నారు. పైగా ఏదైనా కేంద్రబ్యాంక్ కనుక బంగారాన్ని విక్రయానికి పెడితే, ధర మళ్లీ బాగా తగ్గడం ఖాయమే.
ఇదీ చూడండి:చైనా నుంచి 220 టన్నుల ఔషధాల తరలింపు