బీమా సంస్థ జవాబుదారీతనం మెరుగుపరచాలని, పాలసీదారులకు మరింత నమ్మకం కలిగించాలనే ఎల్‌ఐసీ వాటాలను విక్రయించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే ఎంత శాతం వాటాను విక్రయించాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. శనివారం చెన్నైలో జరిగిన 'జన్ జన్ కా బడ్జెట్' కార్యక్రమంలో ఆమెపై విషయాలు వెల్లడించారు. వాటాల విక్రయంతో ఎల్‌ఐసీ ఉద్యోగులకు ఎలాంటి నష్టం, ఇబ్బందులు తలెత్తవని సంస్థ ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్ తెలిపారు. కాగా. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా ఎల్‌ఐసీలో ప్రభుత్వం తన మైనారిటీ వాటాను విక్రయించే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి ఇప్పటికే వెల్లడించారు.
వెలిగిపోతున్న దీపం
రెండు చేతులు మధ్యలో వెలిగిపోతున్న దీపం గుర్తుతో మొదలైన ఎల్‌ఐసీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. పైన చెప్పిన గణాంకాలే అందుకు నిదర్శనం. అవే కాదు.. మొత్తం బీమా రంగంలోనే కొత్త ప్రీమియం వ్యాపారంలో నాలుగింట మూడో వంతు దీనిదే. అవును మరి ఎవరిని అడిగినా కచ్చితంగా ఎల్‌ఐసీ బీమాను కలిగి ఉంటారు. ఆ తర్వాతే మిగతా సంస్థల బీమా సంగతి. అందుకే కదా ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు మార్కెట్లో పోటీపరంగా హెచ్చుతగ్గులకు గురైనా ఎల్‌ఐసీ మాత్రం బలంగా కొనసాగుతోంది. భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో మూడో స్థానంలో ఉన్నట్లు టీఆర్‌ఏ రీసెర్చ్ సర్వే-2019 చెబుతోంది. అంతే కాదు.. భారత్‌లోనే అతిపెద్ద సంస్థల్లో ఎల్‌ఐసీ ఒకటి.
ఇదంతా బాగానే ఉంది. మరి ఈక్విటీ మదుపర్లు ఎల్‌ఐసీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా?
ఆ మూడు అంశాల్లో
మిగతా బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్‌ఐసీ ఎవరికీ అందనంత దూరంలో ఉండొచ్చు. అయితే స్థిరమైన వృద్ధి, బలమైన కార్పొరేట్ పాలన, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లతో పోలిస్తే వెనకబడి ఉంది.
వార్షిక ప్రీమియం వృద్ధి
వార్షిక ప్రీమియం వృద్ధి విషయాల్లో ప్రైవేటు జీవిత బీమా కంపెనీలు ముందున్నాయి. ఈ వృద్ధితోనే ఒక కంపెనీ ఎంత వేగంగా కొత్త రిటైల్ వినియోగదార్లను జత చేసుకుంటున్నది ఆధారపడి ఉంటుంది. గత అయిదేళ్లలో చూస్తే ఎల్‌ఐసీ వ్యక్తిగత వార్షిక ప్రీమియం వృద్ధి.. మిగతా ప్రైవేటు జీవిత బీమా కంపెనీలతో పోలిస్తే తక్కువే ఉంది. ఏప్రిల్-డిసెంబరులో ఎల్‌ఐసీ వార్షిక ప్రీమియం వృద్ధి 14 శాతంగా ఉండగా.. ప్రైవేటు కంపెనీల విషయంలో ఇది 19 శాతంగా ఉంది. మార్చి 2016లో ఈ విషయంలో ఎల్‌ఐసీ మార్కెట్ వాటా 77 శాతంగా ఉండగా.. ఇపుడు అది 52 శాతానికి పరిమితమైంది.