తెలంగాణ

telangana

ETV Bharat / business

మ్యూచువల్​ ఫండ్లు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? - mutuval funds

చాలా మంది మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. ఒక్కసారి వీటిలో పెట్టుబడి పెట్టే ముందు వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి? వాటిని వేటి ఆధారంగా వర్గీకరీస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Do you know how many types of mutual funds there are?
మ్యూచువల్​ ఫండ్లు ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలుసా?

By

Published : Jan 10, 2020, 6:05 AM IST

Updated : Jan 10, 2020, 8:23 AM IST

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు వాటి వర్గీకరణను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాధాన్యత ఆధారంగా ఈక్విటీ, డెట్‌లుగానూ, కాలపరిమితి ఆధారంగా ఓపెన్‌ ఎండెడ్‌, క్లోజ్‌ ఎండెడ్‌ పథకాలుగానూ మ్యూచువల్‌ ఫండ్లను వర్గీకరించారు.

1. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్లు

ఈ పథకం ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు ఎప్పుడైనా జరపవచ్చు. అవసరానికి తగ్గట్టు కొత్త యూనిట్ల జారీ, కొత్త యూనిట్ల అమ్మకాలను జరుపుతారు. కొత్త యూనిట్ల జారీకి పరిమితులు లేవు. పెట్టుబడిదారులు నికర ఆదాయ విలువ (ఎన్‌ఏవీ) వద్ద ఎన్ని యూనిట్లనైనా అమ్మవచ్చు, కొనవచ్చు.

ముఖ్యమైన లక్షణాలు :

లిక్విడిటీ:
మదుపర్లు తమకు అవసరమైనప్పుడు యూనిట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరపవచ్చు. మార్కెట్‌ పరిస్థితి బాగున్నప్పుడు లాభాలను, నష్టాల్లో ఉన్నప్పుడు యూనిట్ల అమ్మకాలను జరిపేందుకు మదుపర్లకు అవకాశం ఉంది.

అతి పెద్ద భాగస్వామ్యం:

లాభాల్లో నడిచే పథకంలో పెద్ద సంఖ్యలో మదుపర్లు పాల్గొని లబ్ధి పొందవచ్చు.

నిష్క్రమణ:

పథకం నుంచి ఏ సమయంలోనైనా నిష్క్రమించే అవకాశం ఉన్నందుకు క్లోజ్‌ ఎండెడ్‌ పథకాలతో పోలిస్తే మదుపర్లకు నిష్క్రమణ భారం తక్కువగా ఉంటుంది.

క్రమమైన పెట్టుబడి:

ఈ పథకంలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) చేసుకునే సౌలభ్యం ఉన్నందుకు పెట్టుబడి క్రమశిక్షణ అలవడుతుంది.

అమ్మకాల భారం:

ఏ సమయంలోనైనా యూనిట్లను అమ్ముకునే సౌలభ్యం ఉండడం ఈ పథకానికి ప్రతికూల అంశం. ఫండ్‌ నిర్వాహకులకు యూనిట్ల అమ్మకాలను పర్యవేక్షించడం భారంగా మారుతుంది. దీని కోసం కొంత సొమ్మును వారు అందుబాటులో ఉంచుకోవాలి లేదా ద్రవ్య రూప విధానాల్లో పెట్టుబడి పెట్టాలి. అవి తక్కువ రాబడిని అందిస్తాయి. దీని ప్రభావం మొత్తం పథకం పనితీరుపై పడుతుంది.

2. క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్లు

నిర్ణీత మెచ్యూరిటీ తేదీ, గడువులతో ఈ పథకాలుంటాయి. ఫండ్‌ అందుబాటులో ఉంచిన సమయంలోనే కొనుగోళ్లకు అవకాశం ఉంటుంది. కొత్త యూనిట్లను ఎల్లవేళలా అమ్మకానికి ఉంచరు. అలాగే ఉన్న యూనిట్లను గడువుకు ముందు అమ్మేందుకు వీల్లేదు.

ముఖ్య లక్షణాలు :

దీర్ఘకాల పెట్టుబడులు :

క్లోజ్‌ ఎండెడ్‌ పథకానికి ఇదెంతో అనుకూలమైన అంశం. ఫండ్లకు నిర్ణీత గడువు ఉన్నందుకు ఫండ్‌ నిర్వాహకుడికి దీర్ఘకాల పెట్టుబడుల్లో ఉంచేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ లాభాలను పొందేందుకు వీలుంటుంది. ఈ విధానాన్ని సామాన్యంగా మూడేళ్ల లాక్‌ ఇన్‌ పీరియడ్‌తో వచ్చే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) అమలుచేస్తారు. డెట్‌లో అయితే ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ పథకాల ద్వారా అమలుచేస్తారు.

అమ్మకాల భారం:

అమ్మకాల భారం నిర్ణీత గడువుకు కేటాయించడంతో ఫండ్‌ నిర్వాహకుడిపై భారం తగ్గుతుంది. సొమ్మును ఖాళీగా ఉంచకుండా ఏదైనా పెట్టుబడి మార్గాల్లో మళ్లించేందుకు పుష్కలమైన అవకాశాలుంటాయి. తద్వారా అధిక రాబడి వచ్చేందుకు దోహదపడుతుంది.

మధ్యంతర నిష్క్రమణకు ఇతర మార్గాలు :

పెట్టుబడులను సులభంగా నగదు రూపంలోకి మార్చుకునే అవకాశాన్ని కల్పించేందుకు క్లోజ్‌ ఎండెడ్‌లోనూ మధ్యంతర నిష్క్రమణ మార్గాలున్నాయి. స్టాక్‌ఎక్స్ఛేంజీ లో క్లోజ్‌ ఎండెడ్‌ యూనిట్లను అందుబాటులో ఉంచుతారు. ఎక్స్ఛేంజీ ద్వారా యూనిట్ల అమ్మకాలు జరిపి సొమ్ము పొందొచ్చు. మరో మార్గంలో కొన్ని ఫండ్‌ సంస్థలు నికర ఆదాయ విలువ ఎన్‌ఏవీకు యూనిట్లను ఒక్కోసారి కొనుగోలు చేస్తాయి. ఆ సమయానికి అవకాశాన్ని ఉపయోగించుకొని మదుపర్లు యూనిట్లను అమ్ముకోవచ్చు.

సెబీ మార్గనిర్దేశాల ప్రకారం పైన పేర్కొన్న రెండు మార్గాల్లో ఏదైనా ఒకటి మదుపర్లకు అందుబాటులో ఉంచాలి. ఫండ్లను స్టాక్‌ఎక్స్ఛేంజీలో ట్రేడ్‌ చేసేటప్పుడు ఫండ్‌ నిర్వహణపై యూనిట్‌ విలువ ఆధారపడి ఉంటుంది.

భారీ నిష్క్రమణ ఛార్జీలు :

మెచ్యూరిటీ తేదీ కన్నా ముందే ఫండ్లను తిరిగి కొనేందుకు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు అవకాశం ఇచ్చినా భారీ నిష్క్రమణ ఛార్జీల భరించక తప్పదు. ఇది ఒక్కోసారి 4నుంచి 5శాతం వరకు ఉంటుంది.

ట్రాక్‌ రికార్డు కొరత :

క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్లు న్యూ ఫండ్‌ ఆఫర్‌ సమయంలో మాత్రమే అందుబాటులో ఉన్నందుకు ఇలాంటి పథకాల పూర్వాపరాలు, వాటి గత పనితీరు పరిశీలించేందుకు అవకాశం లేదు.

ఎలాంటి పథకం తీసుకోవాలనేది పెట్టుబడిదారు అవసరం, విచక్షణను బట్టి ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నిర్ణీత గడువు వరకూ ఉంచుకోవాలనుకుంటే క్లోజ్‌ ఎండెడ్‌ పథకం మంచిది. అదే స్వల్పకాల అవసరాలకు, సులభంగా నగదుగా మార్చుకునే వెసులుబాటు కోరుకునేట్టయితే ఓపెన్‌ ఎండెడ్‌ పథకానికి ఓటేయడం సబబు.

3.ఇంటర్వెల్‌ పథకాలు :

ఓపెన్‌ ఎండెడ్‌, క్లోజ్‌ ఎండెడ్‌ పథకాల మిశ్రమ లక్షణాలతో రూపొందించిందే ఇంటర్వెల్‌ పథకాలు.

నిర్దేశించిన కాలంలో స్టాక్‌ ఎక్స్ఛేంజీ లో యూనిట్లను ట్రేడింగ్ జరుగుతుంది. ట్రేడింగ్ ధరలు ఎన్ఏవీల ధరల ఆధారంగా ఉంటుంది. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు ఈ రకానికి చెందినవి.

Last Updated : Jan 10, 2020, 8:23 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details