రుణగ్రహీతల సమ్మతి లేకుండా ఈ ఏడాది మే నెలలో తమ అనుబంధ సంస్థ భారత్ ఫినాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్(బీఎఫ్‌ఐఎల్) 84 వేల రుణాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఇండస్‌ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. సాంకేతిక సమస్యల వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించింది. 'ఎవర్‌గ్రీనింగ్'(శాశ్వత పునరుద్ధరణ)లో భాగంగానే బ్యాంకు ఈ అక్రమ పద్ధతులను అవలంబించిందని వస్తున్న ఆరోపణలను ఖండించింది.
ఎవరైనా రుణం తీసుకొని తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోతే.. బ్యాంకులు మరోసారి వారికి అదనపు రుణం ఇచ్చి పాత రుణం ఖాతాలో జమచేసుకుంటాయి. రుణ కాలపరిమితి ముగిసిన ప్రతిసారీ ఇలాగే పునరుద్ధరిస్తూ వెళ్తాయి. దీని వల్ల రుణగ్రహీతకు రుణం పొందే అర్హత పెరుగుతుంది. అలాగే బ్యాంకుల పద్దు పుస్తకాల్లో మొండి బకాయిల మొత్తం తగ్గుతుంది. బ్యాంకు మంజూరు చేసిన రుణం మాత్రం ఎప్పటికీ వసూలు కాదు. దీన్నే ఎవర్‌గ్రీనింగ్ అంటారు. ఇది భారత బ్యాంకింగ్ వ్యవస్థలో తరచూ జరుగుతుంటుంది! నియంత్రణ సంస్థలు మాత్రం ఈ విధానాన్ని అస్సలు అనుమతించవు. తాజాగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ మంజూరు చేసిన 84 వేల రుణాలు కూడా ఎవగ్రీనింగ్‌లో భాగమేనని ఓ ప్రజావేగు ఆరోపించారు.