digital university framework: కొవిడ్ మహమ్మారి కారణంగా విద్యకు దూరమైన పిల్లలకు అనుబంధ విద్యను అందించే ప్రతిపాదన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే చాలా మంది ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు విద్యకు దూరం అయ్యారని గుర్తు చేశారు. ఇందుకుగాను వారి కోసం పీఎం ఈ-విద్య కింద ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు స్థానిక భాషల్లో టీవీ ఛానళ్ల ద్వారా పాఠాలు చెప్పనున్నట్లు ప్రకటించారు. వన్ క్లాస్- వన్ టీవీ ఛానల్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ప్రధానమంత్రి ఈ-విద్యలో భాగంగా టీవీ ఛానళ్ల సంఖ్యను 12 నుంచి 200 వరకు పెంచుతున్నట్లు నిర్మల పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆన్లైన్ విద్యను మరింత పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు చెప్పారు నిర్మల. ఇందుకోసం ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, టీవీ, రేడియో ఆధారిత విద్యాను అమలు చేసేందుకు ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు ప్రపంచస్థాయి ఉపకరణాలు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.
విద్యార్థులకు ఐఎస్‌టీఈ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా తెలిపారు. దేశంలోని ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా, అర్థం అయ్యేలా పలు ప్రాంతీయ భాషల్లో కోర్సులను ఈ వర్సిటీ అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న టాప్ యూనివర్సిటీల సహకారంతో ఈ డిజిటల్ వర్సిటీలో కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.