కరోనా సమయంలో వ్యాపారాలు ముందుకు సాగేందుకు టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించడం నిర్మాణాత్మక మార్పు అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎప్‌సీసీఐ) అధ్యక్షురాలు డాక్టర్ సంగీతారెడ్డితో శనివారం జరిగిన ఫైర్‌సైడ్ ఛాట్‌లో ఆయన మాట్లాడారు. 93వ ఇండస్ట్రీ లాబీ వార్షిక సమావేశంలో ఆయన పలు కీలక విషయాలు చర్చించారు. డిజిటల్ టెక్నాలజీ చుట్టూ తమ మౌలిక కార్యకలాపాలు, సదుపాయాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.
కృత్రిమమేధ, దాని చుట్టూ ఉన్న నూతన ప్రపంచం అన్న అంశంపై మాట్లాడిన ఆయన.. ఆరోగ్యం, ప్రభుత్వం, విద్య, సేవా, తయారీ రంగాలు టెక్నాలజీ సాయంతో కొత్త రూపును సంతరించుకున్నాయని తెలిపారు. ఆరోగ్యం, ఆర్ధిక రంగాల్లో పరిశ్రమలన్నీ టెక్నాలజీని ఉపయోగించడం మంచి విషయమన్నారు. కృత్రిమమేధ, సాంకేతిక సామర్ధ్యం అనేవి ప్రస్తుతం ప్రతి పరిశ్రమలోనూ నిండిపోయాయన్నారు. భారతదేశంలోని మొబైల్ ఫోన్లు అంచనాలకు మించి గొప్పగా తయారవుతున్నాయన్నారు. ఈ విధమైన సాంకేతిక పురోగతి అందరిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రక్రియలో ఏదో ఒక రంగం వెనకబడకూడదన్నారు. అన్ని రంగాలు ఒకదానికొకటి సహకరించుకుంటేనే ఆర్థిక పురోగతి సాధించగలమని ఆయన తెలిపారు.