తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఇకపై టాటా భవిష్యత్తు ప్రాధాన్యతలు అవే' - టాటా సన్స్​

Tata Chairman: కొత్త ఏడాదికి ముందు టాటా గ్రూప్‌లోని 8 లక్షలకు పైగా ఉద్యోగులకు సంస్థ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​ సందేశమిచ్చారు. రాబోయే రోజుల్లో డిజిటల్‌, కొత్త ఇంధనాలు, సరఫరా వ్యవస్థ బలోపేతం, ఆరోగ్యం.. వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు.

tata group companies
టాటా భవిష్యత్తు ప్రాధాన్యతలు

By

Published : Dec 28, 2021, 6:32 AM IST

Tata Chairman: టాటా గ్రూప్‌ భవిష్యత్‌ వ్యూహంలో భాగంగా డిజిటల్‌, కొత్త ఇంధనాలు, సరఫరా వ్యవస్థ, ఆరోగ్య విభాగాలపై దృష్టి సారించనున్నట్లు ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. కొత్త ఏడాదికి ముందు గ్రూప్‌లోని 8 లక్షలకు పైగా ఉద్యోగులకు ఆయన సందేశమిచ్చారు. 'వ్యాపారాలతో పాటు సమాజం కూడా కొవిడ్‌ వైరస్‌ పరిణామాలకు అలవాటు పడాల్సిందే. కొత్త ఉత్పరివర్తనాలను అత్యుత్తమంగా ఎదుర్కోవాల్సిందే. ఒమిక్రాన్‌ వ్యాప్తి ప్రభావం ఎంత మేర ఉంటుందనేది చూడాల్సి ఉంది' అని పేర్కొన్నారు. 'గ్రూప్‌ ఈ ఏడాది కాలంలో సరళంగా మారింది. ఆర్థికంగా బలోపేతమైంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయంలో మంచి పురోగతి సాధించింది. మన కంపెనీలు సరికొత్త, విప్లవాత్మక సాంకేతికతల నుంచి ప్రయోజనాలు పొందాయి. అన్నిటి కంటే ముఖ్యంగా ఎయిరిండియా బిడ్‌ను గెలుచుకోవడం ద్వారా ఈ ఏడాదిలోనే అత్యంత ముఖ్యమైన మైలురాయిని చేరినట్లయింద'ని పేర్కొన్నారు.

'రాబోయే రోజుల్లో నాలుగు అంశాలపై దృష్టి సారిస్తాం. డిజిటల్‌, కొత్త ఇంధనాలు, సరఫరా వ్యవస్థ బలోపేతం, ఆరోగ్యం. ఇప్పటికే ఈ మార్పులన్నిటినీ మన కంపెనీలు అందిపుచ్చుకున్నాయి. మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయి. టాటా కొత్త వ్యాపారాల్లో 5జీ నుంచి టాటాన్యూ(డిజిటల్‌ విభాగం), టాటా ఎలక్ట్రానిక్స్‌ వంటివన్నీ ప్రయోజనాలను పొందనున్నాయ'ని వివరించారు. 'కరోనా అంశంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వహించకూడదు. ఉద్యోగులు తాజా మార్గదర్శకాలను పాటించాలి. ముందుజాగ్రత్త డోసులు అందుబాటులోకి వచ్చినపుడు వేసుకోవాలి. కొవిడ్‌ కారణంగా గత ఏడాది కాలంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సవాళ్ల సమయంలో టాటా గ్రూప్‌ సైతం అవసరమైన వారికి ఆక్సిజన్‌తో పాటు మౌలిక వసతులను అందజేసింద'ని అన్నారు.

ఇదీ చూడండి :మార్కెట్లోకి హైస్పీడ్​ ఈ-బైక్.. ఒక్కసారి ఛార్జింగ్​తో 150 కి.మీ!

ABOUT THE AUTHOR

...view details