తెలంగాణ

telangana

ETV Bharat / business

Digital Gold: ఒక్క రూపాయితో బంగారం కొనొచ్చు.. కానీ...

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం దేశంలో లోహరూపంలోనే కాక డిజిటల్​ రూపంలోనూ పసిడిపై పెట్టుబడలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఈ డిజిటల్​ గోల్డ్ (digital gold)​ అంటే ఏంటో మీకోసం..

digital gold
డిజిటల్​ గోల్డ్

By

Published : Aug 31, 2021, 2:55 PM IST

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. భారతీయులకు పసిడిపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. గత ఏడాది ప్రపంచంలో అత్యధిక బంగారం దిగుమతి చేసుకున్న దేశాల జాబితాలో భారత్‌ది తొలిస్థానం. భారతీయులు బంగారాన్ని ఓ పెట్టుబడి సాధనంగానూ ఉపయోగించుకుంటున్నారు. అయితే, గతంలో వలే బంగారాన్ని నేరుగా లోహరూపంలో కొనాల్సిన అవసరం లేదు. గోల్డ్‌ బాండ్లు, ఈటీఎఫ్‌లు, డిజిటల్‌ గోల్డ్‌ (digital gold) ఇలా పలు మార్గాల్లో మదుపు చేయొచ్చు. కొత్త తరం కుర్రకారు డిజిటల్‌ గోల్డ్‌లో మదుపు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి డిజిటల్‌ గోల్డ్‌ అంటే ఏంటో చూద్దాం!

డిజిటల్‌ గోల్డ్‌ అంటే..

పేరు సూచిస్తున్నట్లుగా మీ వద్ద భౌతికంగా బంగారం ఉండదు. మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని వర్చువల్‌గా ఆన్‌లైన్‌ ఖాతాలో ఉంచవచ్చు. డబ్బులు చెల్లించిన ప్రతిసారి అంత విలువైన బంగారాన్ని విక్రేతలే కొని వారి వద్ద ఉంచుతారు.

ఎందుకింత ఆదరణ..

సాధారణంగా లోహరూపంలో బంగారాన్ని కొనాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.5 వేలైనా అవసరం. అంతకంటే తక్కువ అంటే కష్టమే. కానీ, డిజిటల్‌ గోల్డ్‌లో అలా కాదు. ఒక్క రూపాయి విలువైన బంగారాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు. పైగా నకిలీని గుర్తించడం కష్టమవుతున్న ఈరోజుల్లో డిజిటల్‌ గోల్డ్‌ వల్ల అటువంటి సమస్యలేమీ ఉండవు. అలాగే, బంగారం లోహరూపంలో మన దగ్గర ఉందంటే.. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కానీ, డిజిటల్‌ గోల్డ్‌ వల్ల అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మన తరఫున విక్రేతలే బంగారాన్ని కొని సురక్షితంగా ఉంచుతారు. బీమా సౌకర్యం కూడా ఉంటుంది. పైగా వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో ధరలపై స్థానిక పరిణామాల ప్రభావం ఉండదు. మీరు కావాలనుకున్నప్పుడు లోహరూపంలో మీకు అందజేస్తారు. ఆన్‌లైన్‌ రుణాలకు డిజిటల్‌ గోల్డ్‌ తనఖా పెట్టొచ్చు. ఈ ప్రయోజనాల కారణంగానే డిజిటల్‌ గోల్డ్‌కి ఈ మధ్యకాలంలో అత్యంత ప్రాచుర్యం లభించింది.

ఎవరు విక్రయిస్తున్నారు..

భారత్‌లో ఆగ్మొంట్‌ గోల్డ్‌ లిమిటెడ్‌, ఎంఎంటీసీ-పీఎఎంపీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిజిటల్‌ గోల్డ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు డిజిటల్‌ గోల్డ్‌ను విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీల సేవల్ని పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే, అమెజాన్‌ పే, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వంటి ఫిన్‌టెక్‌ సంస్థలతో పాటు తనిష్క్‌, పీసీజే లాంటి పసిడి విక్రయ సంస్థలు కూడా వినియోగదారులకు చేరువ చేస్తున్నాయి. వీటితో పాటు పలు మొబైల్‌ వ్యాలెట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారంలు కూడా పైన తెలిపిన మూడు కంపెనీల డిజిటల్‌ గోల్డ్‌ ఉత్పత్తులను పంపిణీ చేస్తున్నాయి. ఒకరకంగా ఈ సంస్థలు డిజిటల్‌ గోల్డ్‌ పంపిణీ వ్యవస్థల వలే వ్యవహరిస్తున్నాయి.

సెబీ కొత్త నియమం ఇదే..

ఇప్పటి వరకు ఫిన్‌టెక్‌తో పాటు స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు కూడా డిజిటల్‌ గోల్డ్‌ను వినియోగదారులకు చేరువ చేశాయి. కానీ, సెప్టెంబరు 10 నుంచి అది సాధ్యం కాదని సెబీ తేల్చి చెప్పింది. సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌ నిబంధనలు, 1957 ప్రకారం.. డిజిటల్‌ గోల్డ్‌ను ఓ సెక్యూరిటీగా గుర్తించలేమని స్పష్టం చేసింది. దీంతో డిజిటల్‌ గోల్డ్‌ విక్రయాన్ని నియంత్రించడం సెబీ పరిధిలోకి రాబోదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ అధీనంలో ఉన్న సంస్థలు ఈ విక్రయాలను ఆపేయాలని తెలిపింది.

ఇప్పటికే కొనుగోలు చేసిన వారి పరిస్థితి..

ఇప్పటికే బ్రోకింగ్‌ సంస్థల ద్వారా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసినవారు అవే సంస్థల ద్వారా విక్రయించాలి. లేదా లోహరూపంలో బంగారాన్ని తీసుకోవచ్చు. ఇకపై మదుపర్లు నేరుగా డిజిటల్‌ గోల్డ్‌ విక్రయిస్తున్న సంస్థలతోనే సంబంధాలు కొనసాగించాలి. అయితే, నాన్‌ బ్రోకింగ్‌ వేదికలైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలు మాత్రం ఈ సేవల్ని వినియోగదారులకు చేరువ చేయొచ్చు.

** డిజిటల్‌ గోల్డ్‌ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణా సంస్థలు లేకపోవడం ఒక పెద్ద లోటు.

ఇదీ చూడండి:బంగారంలో పెట్టుబ‌డికి స‌రైన పథకం ఏది ?

ABOUT THE AUTHOR

...view details