ప్రస్తుతం కరోనా రెండో దశ ఉద్ధృతంగా మారుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీ పెరుగుతోంది. దీనితో ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ తదితర ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా వైపు ఒత్తిడి ఇంకా పెరగవచ్చని చెప్తున్నారు.
గతేడాది కరోనా వచ్చిన సమయంలో లాక్డౌన్ విధించటంలో స్థిరాస్తి రంగం ప్రతికూల ప్రభావం చవిచూసింది. అయితే కేవలం ఆరు నెలల వ్యవధిలో మంచి ప్రదర్శన కనబర్చింది. పలు సర్వేలు కూడా ఇదే విషయాలను వెల్లడించాయి. ఆనరాక్ చేసిన సర్వే ప్రకారం 2020 రెండో అర్ధ భాగంలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. దీనికి బిల్డర్ల ఆఫర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మళ్లీ కరోనా విజృంభిస్తుండటం వల్ల మరోసారి స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం పడనుంది.
కార్మికుల లభ్యత తగ్గి...
చాలా రాష్ట్రాల్లో కరోనా రెండోదశ కొనసాగుతోంది. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున కార్మికుల లభ్యత తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆంక్షలు ఇందుకు అదనంగా ఉండనున్నాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు ఆలస్యంగా పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో పాటు సరఫరా తగ్గవచ్చు. ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్ల కాలం కొనసాగుతోంది. కాబట్టి డిమాండ్ వైపు తగ్గుదల కనిపించినా కొన్ని విభాగాల్లో రికవరీ వేగంగా ఉండవచ్చని ఈ రంగంలోని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల డిమాండ్‌కు సరిపడా ఇళ్లు లేకపోతే నగరాల్లో ధరలు పెరగవచ్చని స్థిరాస్తి అభివృద్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.
మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మొత్తంగా డిమాండ్ మళ్లీ తగ్గే అవకాశం ఉంది. అయితే అందుబాటు ధరల గృహాలు, మధ్యస్థాయి ధరల గృహాల్లో డిమాండ్ రికవరీ వేగంగానే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ సబ్సిడీతో పాటు గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు ఉండటమే దీనికి కారణమని నిపుణులు వివరించారు.
వర్క్ ఫ్రమ్ హోం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల చిన్న పట్టణాల్లో గృహాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉండనుంది. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువ రోజులు ఉన్నట్లయితే స్థిరాస్తి రంగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా కానీ పక్షంలో రెండేళ్ల కింద ఉన్న స్థాయికి ఈ రంగం చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
2021 తొలి త్రైమాసికంలో సానుకూలం..
2020 మొదటి త్రైమాసికంతో పోల్చితే 2021లో తొలి మూడు నెలల్లో దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు 29 శాతం పెరిగినట్లు ఆనరాక్ అంచనా వేసింది. 2021 క్యూ1లో 58,290 ఇళ్లు విక్రయమయ్యాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ 51 శాతం పెరిగింది. ఈ సమయంలో కొత్తగా 62,310 ఇళ్లకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. త్రైమాసికం వారీగా చూసుకుంటే విక్రయం కానీ ఇన్వెంటరీ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 1 శాతం మాత్రమే తగ్గింది. క్యూ1, 2020 లో 6.44 లక్షల యూనిట్లు విక్రయం కానీ ఇళ్లు ఉండగా... ఆ సంఖ్య క్యూ1, 2021లో 6.42 లక్షల యూనిట్లకు తగ్గింది.