తెలంగాణ

telangana

ETV Bharat / business

విమాన టికెట్​ కొనాలా? ఇలా చేయకండి! - Airlines ticket price Issue

విదేశాలకు వెళ్లే ప్రయాణికులు.. విమాన టికెట్ ధరలను సంబంధిత ఎయిర్​లైన్​ సంస్థ వెబ్​ సైట్లోనే చూసుకోవాలని డీజీసీఏ సూచించింది. మెటా సెర్చ్ ఇంజిన్లలో ఇటీవల ధరలు అధికంగా ఉన్నట్లు చూపించిన నేపథ్యంలో ఈ సలహాలు ఇచ్చింది. విమానయాన సంస్థలు కూడా టికెట్​ ధరల విషయంలో జాగ్రత్త వహించాలని డీజీసీఏ పేర్కొంది.

DGCA on fares of airline's
విమాన టికెట్ ధరలపై డీజీసీఓ సూచనలు

By

Published : Aug 10, 2021, 3:18 PM IST

బ్రిటన్‌లో కళాశాలల అడ్మిషన్‌ సీజన్‌ కావడం వల్ల లండన్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలను ఇటీవల ఆయా విమానయాన సంస్థలు భారీగా పెంచేశాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్‌ ధరల కోసం సంబంధిత ఎయిర్‌లైన్‌ అధికారిక వెబ్‌సైట్లోనే చూసుకోవాలని సూచించింది. మెటా సెర్చ్‌ ఇంజిన్లలో వాస్తవమైన ధరలు ఉండకపోవచ్చని పేర్కొంది.

గందరగోళంగా ధరలు..

దిల్లీ-లండన్‌ మార్గంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ టికెట్‌ ధర ఆగస్టు 26వ తేదీకి రూ.3.95 లక్షలు పలుకుతోందని కేంద్ర హోంశాఖ ఇంటర్‌స్టేట్‌ కౌన్సిల్‌ సెక్రెటేరియట్‌ సెక్రెటరీ సంజీవ్‌ గుప్తా ఇటీవల ట్వీట్ చేశారు. దీనిపై పౌరవిమానయాన శాఖ స్పందిస్తూ.. ఆగస్టు నెలలో దిల్లీ-లండన్‌ మధ్య ఎకానమి క్లాస్‌ టికెట్‌ ధర రూ. 1.03లక్షల నుంచి రూ. 1.47లక్షలు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే గూగుల్‌ వంటి మెటా సెర్చ్‌ ఇంజిన్‌లలో ఒక్కోసారి ఎయిర్‌లైన్‌ వెబ్‌సైట్లలో ఉండే ధరల కంటే ఎక్కువ ధరలు చూపిస్తున్నాయని, దీనివల్ల గందరగోళ సమస్యలు తలెత్తుతున్నాయని డీజీసీఏ అధికారులు సోమవారం తెలిపారు.

ధరల్లో హెచ్చుతగ్గులు ఎందుకు?

ఈ పరిణామాలపై డీజీసీఏ తాజాగా స్పందిస్తూ.. ప్రయాణికులకు ఈ సూచనలు చేసింది. 'విదేశాలకు వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్‌ ధరల కోసం సంబంధిత ఎయిర్‌లైన్ల అధికారిక వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మెటా సెర్చ్‌ ఇంజిన్లు వాస్తవమైన పాయింట్ టు పాయింట్‌ టికెట్‌ ధరలను చూపించకపోవచ్చు. అంతేగాక, వాటిల్లో ఎయిర్‌లైన్ కాంబినేషన్లు కూడా ఉంటాయి. వీటివల్ల చివరకు అధిక ధరలు కన్పిస్తాయి' అని డీజీసీఏ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

మరోవైపు టికెట్‌ ధరలకు సంబంధించి విమానయాన సంస్థలకు కూడా డీజీసీఏ పలు ఆదేశాలు జారీ చేసింది. మెటా సెర్చ్‌ ఇంజిన్లలో విమాన టికెట్‌ ధరలు ఎయిర్‌లైన్‌ వెబ్‌సైట్లలో కంటే ఎక్కువ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. అధిక గిరాకీ వల్ల కొన్ని కీలక అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలు గత నెల రోజుల వ్యవధిలో గణనీయంగా పెరిగాయి. సర్వీసులు సరిపడా లేకపోవడం సహా విమాన ఇంధన ధరలు పెరగడం వల్ల సదరు సంస్థలు టికెట్‌ ధరలను పెంచేశాయి.

ఇదీ చదవండి:దిల్లీ- లండన్​ విమాన టికెట్​ ధరలపై కేంద్రం క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details