రియల్ ఎస్టేట్ డెవలపర్ అభివృద్ధి చేసి ఇచ్చిన భూమిని తిరిగి ప్లాట్లుగా చేసి విక్రయిస్తే.. వాటికి కూడా జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) స్పష్టం చేసింది. ప్రాథమిక సౌకర్యాలైన విద్యుత్, వాటర్‌లైన్, డ్రైనేజీల కోసం భూమి విక్రయించినా జీఎస్టీ తప్పదని పేర్కొంది.
అభివృద్ధి చేసిన ప్లాట్ల అమ్మకం అనేది.. 'కొనుగోలుదారుడికి విక్రయించేందుకు ఉద్దేశించిన కాంప్లెక్స్ నిర్మాణం' అనే నిబంధన పరిధిలో ఉంటుందని.. దానికి అనుగుణంగానే జీఎస్టీ కట్టాలని ఏఏఆర్ తేల్చిచెప్పింది.
భూముల అమ్మకంపై వస్తు, సేవల పన్ను వర్తిస్తుందా? అంటూ ఓ దరఖాస్తుదారుడు ఏఏఆర్ గుజరాత్ బెంచ్‌ను సంప్రదించాడు. ప్రాథమిక సౌకర్యాలు అయిన డ్రైనేజీ, వాటర్ లైన్, విద్యుత్ లైన్, ల్యాండ్ లెవలింగ్ మొదలైన వాటి కోసం విక్రయం జరిపినప్పుడు కూడా జీఎస్టీ కట్టాల్సి ఉంటుందా? అని ప్రశ్నించాడు. దీనికి 'జీఎస్టీ చెల్లించాల్సిందే' అని ఏఏఆర్ స్పష్టం చేసింది.
దామాషా ప్రకారం
భూమిని ప్లాటులుగా చేసి విక్రయించాలనుకుంటే... భూమి ధరతో పాటు, ప్రాథమిక సౌకర్యాల కల్పన కోసం పెట్టిన ఖర్చులు కూడా కలిపే అమ్ముతారు. అందువల్ల వాటికి కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
'ఇలాగైతే చాలా కష్టం'