స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తుండటంతో ఎంతోమంది షేర్లు, ఈక్విటీ పథకాల్లో మదుపు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల జాబితా ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలి. అందుకే డెట్ పథకాలూ ఇందులో ఉండాలని నిపుణుల సూచన.
అత్యవసర నిధి కోసం..: ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి, కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా సొమ్ము చేతిలో ఉండటం ఎప్పుడూ మంచిది. ఈ మొత్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉండాలి. ఈ డబ్బు రాబడిని సంపాదించేందుకు కాదు. కాబట్టి, అధిక హెచ్చుతగ్గులు ఉండే ఈక్విటీల్లో మదుపు చేయలేం. ఒకవేళ చేసినా.. అవసరం వచ్చినప్పుడు సూచీలు పడిపోతే.. షేర్లను అమ్మినప్పుడు నష్టాలు మిగులుతాయి. అందుకే, లిక్విడ్, ఓవర్‌నైట్ ఫండ్లలాంటివి అత్యవసర నిధిని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ రెండూ ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్ విభాగంలోకి వస్తాయి. వీటిలో మంచి పథకాలను ఎంపిక చేసుకొని, మదుపు చేయాలి. డబ్బు కావాలనుకుంటే.. అమ్మిన తర్వాత రోజు ఖాతాలో జమ అవుతాయి. అత్యవసర నిధిని బ్యాంకు డిపాజిట్లలోనూ పెట్టుకోవచ్చు.
పీపీఎఫ్.. ఈపీఎఫ్..:డెట్ పెట్టుబడులు అంటే.. సురక్షితంగా ఉంటూ, స్థిరమైన రాబడిని అందించాలి. ఈ నిర్వచనంతో చూస్తే.. ఈపీఎఫ్, పీపీఎఫ్‌లనూ డెట్ పథకాల కింద చూడొచ్చు. అయితే, ఇవి దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలు. ముందుగా డబ్బు తీసుకోవాలంటే.. కొన్ని నిబంధనల మేరకే అనుమతి లభిస్తుంది. ప్రభుత్వ హామీ ఉండటం ఇక్కడ కలిసొచ్చే అంశం. డబ్బుతో అంతగా అవసరం లేనివారు.. ఈ పథకాలను తమ పెట్టుబడి జాబితాలో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.