పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్‌ఎస్‌ఏ) నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. వీటి ఖాతాదార్లు తప్పనిసరిగా చేయాల్సిన కనీస డిపాజిట్ గడువును మూడు నెలలు (జూన్ 30 వరకు) పొడిగించింది. కొవిడ్-19 నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నందున చిన్న మొత్తాల డిపాజిటుదార్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
పీపీఎఫ్, ఎస్‌ఎస్‌ఏ ఖాతాల్లో డిపాజిట్‌పై సడలింపులు - పీపీఎఫ్, ఎస్‌ఎస్‌ఏ నిబంధనల సడలింపు
దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో చిన్న మొత్తాల డిపాజిటుదార్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్‌ఎస్‌ఏ) నిబంధనల్లో సడలింపులు చేసింది.

పీపీఎఫ్, ఎస్‌ఎస్‌ఏ ఖాతాలు క్రియాశీలకంగా (యాక్టివ్) ఉండాలంటే ఖాతాదార్లు ఒక ఏడాదిలో కొంత మొత్తాన్ని డిపాజిటు చేయాల్సి ఉంటుంది. లేకుంటే జరిమానా వసూలు చేస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని 80సి కిందకు ఈ పథకాలు కూడా వస్తుండటంతో సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాదార్లు వీటిల్లో డిపాజిటు చేస్తుంటారు. ‘2019-20లో డిపాజిటు చేయకుంటే ఇప్పుడు జూన్ 30 వరకు పీపీఎఫ్, ఎస్‌ఎస్‌ఏ ఖాతాదార్లు డిపాజిటు చేసుకోవచ్చ’ని ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే డిపాజిటు చేసిన తేదీ నుంచే వడ్డీ వర్తిస్తుందని పేర్కొంది.