తెలంగాణ

telangana

ETV Bharat / business

ఔషధ అమ్మకాలు మళ్లీ పైపైకి.. కారణం అదే! - వైద్యసేవలు

ఈ ఏడాది నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చితే 6.6 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్యసేవలు సాధారణ స్థితికి చేరుకోవటం, జీవనశైలి వ్యాధులు, ఇతర జబ్బుల బారిన పడినవారు చికిత్సలకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నందున నవంబరు నెల మందుల అమ్మకాల్లో కొంత పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది

demand for medicines raise in india
ఔషధ అమ్మకాలు మళ్లీ పైపైకి.. కారణం అదే!

By

Published : Dec 11, 2021, 7:12 AM IST

కొవిడ్‌-19 మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇతర వైద్య విభాగాల్లో చికిత్సలకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దేశీయంగా గత నెలలో మందుల అమ్మకాల తీరుతెన్నులను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడవుతోంది. ఈ ఏడాది నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చినప్పుడు 6.6 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రో-ఇంటెస్టినల్‌, శ్వాసకోశ వ్యాధులు, నొప్పి నివారణ, గైనకాలజీ, సీఎన్‌ఎస్‌ (సెంట్రల్‌ నెర్వస్‌ సిస్టమ్‌) విభాగాల్లో అధిక అమ్మకాలు నమోదయ్యాయి.

దేశీయ ఔషధాల మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో, క్రితం ఏడాదితో పోల్చితే అత్యధిక వృద్ధి నమోదైన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 51.5 శాతం, మే నెలలో 47.8 శాతం వృద్ధి కనిపించింది. దీనికి ప్రధాన కారణం కొవిడ్‌ మహమ్మారే. ఆ సమయంలో డెల్టా వేరియంట్‌ విజృంభణతో ఎంతో మంది ఆస్పత్రుల పాలు కావటం వల్ల మందుల వాడకం అధికంగా నమోదైంది. ఆ తర్వాత వ్యాధి తీవ్రత తగ్గి.. ఆ మేరకు మందులు అమ్మకాలు తగ్గాయి. అక్టోబరు నెల నాటికి మందుల అమ్మకాల్లో పెరుగుదల కనిష్ఠంగా 5 శాతానికి దిగివచ్చింది. మళ్లీ నవంబరులో 6.6 శాతం పెరుగుదల కనిపించింది. వైద్యసేవలు సాధారణ స్థితికి చేరుకోవటం, జీవనశైలి వ్యాధులు, ఇతర జబ్బుల బారిన పడినవారు చికిత్సలకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నందున నవంబరు నెల మందుల అమ్మకాల్లో కొంత పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మళ్లీ కొన్ని కొవిడ్‌-19 కేసులు రావటం కూడా దీనికి దోహదపడినట్లు సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఔషధ అమ్మకాలు మళ్లీ పైపైకి

ఫార్మా కంపెనీల వారీగా చూస్తే.., గత నెలలో మందుల అమ్మకాల్లో అరిస్టో ఫార్మా అత్యధిక వృద్ధి కనబరచింది. తర్వాత స్థానాల్లో ఎమ్‌క్యూర్‌ ఫార్మా, మెక్లాయిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఆల్కెమ్‌, మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఉన్నాయి. అరిస్టో ఫార్మా అమ్మకాలు ఏకంగా 28.3 శాతం పెరిగాయి. ఎమ్‌క్యూర్‌ అమ్మకాలు 25.6 శాతం, మెక్లాయిడ్‌ అమ్మకాలు 23.8 శాతం పెరిగినట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. గ్లెన్‌మార్క్‌, సన్‌ఫార్మా, సిప్లా, టొరెంట్‌ ఫార్మా అమ్మకాలు 16 శాతం వరకూ పెరిగాయి. కొవిడ్‌-19 మందులతో పాటు, తీవ్రమైన వ్యాధులకు చికిత్సలో వినియోగించే ఔషధాలు అధికంగా అందిస్తున్నందున అరిస్టో, మెక్లాయిడ్‌, ఎమ్‌క్యూర్‌ ఫార్మా మెరుగైన అమ్మకాలు నమోదు చేసే అవకాశం కలిగినట్లు తెలుస్తోంది.

దేశంలో అత్యధిక మార్కెట్‌ వాటా ఉన్న కంపెనీలు

  • సన్‌ ఫార్మా
  • అబాట్‌
  • సిప్లా
  • మ్యాన్‌కైండ్‌ ఫార్మా
  • జైడస్‌
  • లుపిన్‌ నీ ఆల్కెమ్‌
  • టోరెంట్‌ ఫార్మా
  • ఇంటాస్‌

ఇదీ చూడండి:-అప్పు చేసి మదుపు చేస్తే.. మొదటికే మోసం!

ABOUT THE AUTHOR

...view details