కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో కోడిగుడ్లకు గిరాకీ విపరీతంగా పెరిగినట్లు ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు వెల్లడించారు. గత జనవరి-ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందనే ప్రచారంతో ఒక్కసారిగా గుడ్ల వినియోగాన్ని ప్రజలు తగ్గించారు. అయితే కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో, రోగ నిరోధకత పెంచుకునేందుకు మళ్లీ గుడ్ల వినియోగం పెంచారు. ఒకపక్క లాక్డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు, కార్మికుల కొరత వల్ల సరఫరా ఇబ్బందులున్న ప్రస్తుత సమయంలో గిరాకీ పుంజుకుంది. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయాలు పెరిగిపోవడంతో గుడ్ల రిటైల్ ధరలు ఆయా ప్రాంతాల ఆధారంగా రూ.6-7 వరకు పెరిగాయి.
- కొవిడ్-19 రోగులకు అధికంగా ప్రోటీన్లు లభించే ఆహారం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలో ప్రోటీన్లు అందేందుకు గుడ్లు సులభ మార్గమని నిపుణులు చెబుతున్నారు.
- 'కొన్ని నెలలుగా గుడ్ల వినియోగం బాగా పెరిగింది. వీటిలో అత్యధికంగా 11 శాతం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంద'ని పశు సంవర్థక, పౌల్ట్రీ, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ ఓపీ చౌధరి వెల్లడించారు.
- నెలవారీగా గుడ్ల వినియోగం పెరుగుదలను అంచనా వేయడం కష్టమని మరో అధికారి పేర్కొన్నారు. 2018-19లో ఒక వ్యక్తి సగటు వార్షిక వినియోగం 79 గుడ్లు కాగా, 2019-20కి అది 86 గుడ్లకు చేరిందని వివరించారు.
లాక్డౌన్ ప్రభావం ఇలా
2020 ఏప్రిల్-మేలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కోళ్ల పరిశ్రమ భారీగా దెబ్బతిందని ఇండియన్ బ్రాయిలర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గుల్రేజ్ ఆలమ్ వెల్లడించారు. అప్పుడు గుడ్లు, చికెన్‌కు గిరాకీ కూడా తగ్గిదని తెలిపారు. జూన్-డిసెంబరులో మళ్లీ గిరాకీ పుంజుకుందన్నారు. ఈ ఏడాదికొస్తే జనవరి-ఫిబ్రవరిలో మళ్లీ గిరాకీపై బర్డ్‌ఫ్లూ ప్రభావం పడిందని తెలిపారు. గత ఏడాది జూన్‌లో ఒక వ్యక్తి నెలవారీగా సగటున 7 గుడ్లు తినగా, ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ భయాలతో సరాసరిన 4 గుడ్లు మాత్రమే వినియోగించారని వివరించారు. ఈ ఏడాది ‘మార్చి తర్వాత గిరాకీ మళ్లీ పుంజుకుంది. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో వినియోగం పెరిగి, మళ్లీ నెలకు 7 గుడ్ల స్థాయికి చేరింద’ని ఆలమ్ తెలిపారు.
పట్టణాల్లో అధిక గిరాకీ