కొవిడ్-19 రెండోదశలో కేసుల సంఖ్య రోజుకు లక్షకు పైగా నమోదవుతుండటం, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతున్న వారి సంఖ్యా పెరుగుతుండటంతో, ఈ చికిత్సలో వినియోగిస్తున్న 'రెమ్‌డెసివిర్' ఔషధానికి అనూహ్య గిరాకీ ఏర్పడింది. వ్యాధి తీవ్రత ఎక్కువై, శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్ ద్వారా వైద్యులు ఈ ఔషధాన్ని ఇస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన తొలి రోజు రెండు డోసులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఒక్కో డోసు చొప్పున... మొత్తం ఆరు డోసుల 'రెమ్‌డెసివిర్' ఔషధాన్ని ఇవ్వడం వల్ల రోగి కోలుకునే పరిస్థితి వస్తుంది. మొదటి దశ కొవిడ్-19 ఉద్ధృతి తగ్గేవరకు ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి వైద్యులు ఈ ఔషధంపై అధికంగా ఆధారపడ్డారు. నెమ్మదిగా కేసులు తగ్గిపోవడం, తదుపరి కొవిడ్ టీకా కూడా అందుబాటులోకి రావటంతో 'రెమ్‌డెసివిర్' అవసరం తగ్గిపోయింది. దీంతో ఫార్మా కంపెనీలు కూడా ఈ ఔషధ తయారీని తగ్గించాయి. అందువల్లే మార్కెట్లో తగినంత నిల్వలు లేవు. ఒక్కసారిగా మళ్లీ ఉత్పత్తిని భారీఎత్తున పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అప్పట్లో రూ.6000.. ఇప్పుడు రూ.1000
అమెరికా కంపెనీ అయిన గిలీడ్ సైన్సెస్‌కు చెందిన ఈ ఔషధాన్ని మనదేశంలో 5 ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెటిరో ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ఉన్నాయి. ఇవే కాక సిప్లా, క్యాడిలా హెల్త్‌కేర్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, మైలాన్ ఇండియా కూడా ‘రెమ్‌డెసివిర్’ తయారు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కొవిడ్-19 వ్యాధి తీవ్రమై ఆస్పత్రుల్లో చేరిన వారికి ఉపశమనం కలిగించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతించిన ఔషధం ఇదొక్కటే కావడం గమనార్హం. మనదేశంలో కూడా ఔషధ నియంత్రణ మండలి ‘అత్యవసర వినియోగం’ నిమిత్తం దీనికి అనుమతి ఇచ్చింది. తొలుత ఈ ఔషధాన్ని ఒక్కో డోసును రూ.6,000 ధరకు ఫార్మా కంపెనీలు విక్రయించాయి. అంటే 6 డోసుల చికిత్సకు రూ.36,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫార్మా కంపెనీలు రూ.1,000 ధరకే ఒక్కో డోసు ఇంజక్షన్‌ను ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నాయి. ఒక వయల్ ధరను క్యాడిలా హెల్త్‌కేర్ రూ.899 కే తగ్గించింది. కానీ ఒక్కసారిగా గిరాకీ పెరగడంతో, తగినన్ని అందుబాటులో లేక ‘బ్లాక్ మార్కెట్లో’ అధిక ధరకు ఈ ఔషధాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న ముంబయి, పుణె నగరాల నుంచి పలువురు ‘రెమ్‌డెసివిర్’ కోసం హైదరాబాద్‌లోని తమ సన్నిహితులు, బంధువులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా తగినంతగా సరఫరాలు అందుబాటులో లేకపోవటం గమనార్హం.