హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆప్టిమస్ ఫార్మా, కొవిడ్-19 బాధితుల్లో సత్వర ఉపశమనం కోసం ఉపకరిస్తుందని భావిస్తున్న మోల్నుపిరవిర్ ఔషధంపై మూడో దశ క్లినికల్ పరీక్షలు చేపట్టనుంది. ఇందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి అనుమతి లభించినట్లు ఆప్టిమస్ ఫార్మా వెల్లడించింది. కొవిడ్-19 చికిత్సకు పరిమితమైన ఔషధాలు మాత్రమే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోల్నుపిరవిర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఔషధాన్ని తయారు చేసి దేశీయంగా విక్రయించటానికి అనుమతి కోసం ఇప్పటికే ఆప్టిమస్ ఫార్మా దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగా మూడో దశ క్లినికల్ పరీక్షలకు అంగీకారం తెలిపింది.
మోల్నుపిరవిర్ ఔషధం ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్) ని, ఫార్ములేషన్‌ను ఆప్టిమస్ ఫార్మా సొంతంగా అభివృద్ధి చేసింది. ఇది బాధితులకు అయిదు రోజుల పాటు ఇచ్చే ఔషధం. దీనిపై నిర్వహించే క్లినికల్ పరీక్షల్లో 2,500 మంది వలంటీర్లు పాల్గొంటారని ఆప్టిమస్ ఫార్మా వెల్లడించింది. వెంటనే క్లినికల్ పరీక్షలు ప్రారంభిస్తామని ఆప్టిమస్ ఫార్మా సీఎండీ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. మోల్నుపిరవిర్ ఔషధం ఇప్పటి వరకు నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో ఎంతో ఆశాజనకమైన ఫలితాలు ప్రదర్శించినట్లు గతంలోనే ఆప్టిమస్ ఫార్మా వెల్లడించింది. అయిదు రోజుల పాటు మోల్నుపిరవిర్ 800 ఎంజీ ట్యాబ్లెట్లు రోజుకు రెండు చొప్పున ఇస్తే వైరస్ లోడ్ గణనీయంగా తగ్గినట్లు నిర్ధరణ అయింది.
ఈ ఔషధాన్ని కొవిడ్-19 బాధితులపై వినియోగించటానికి అనువుగా ఇప్పటికే అధ్యయనాలు చేపట్టిన ఎంఎస్‌డీ ఫార్మాసూటికల్స్, మనదేశంలోని కొన్ని ఫార్మా కంపెనీలతో తయారీ- విక్రయాల నిమిత్తం వాలంటరీ లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఎంక్యూర్ ఫార్మాసూటికల్స్, హెటిరో ల్యాబ్స్, సన్ ఫార్మా ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరో పక్క హైదరాబాద్‌కే చెందిన నాట్కో ఫార్మా కూడా మోల్నుపిరవిర్‌కు అత్యవసర అనుమతి కోరుతూ డీసీజీఐకి గత నెలలో దరఖాస్తు చేసింది.
'బారిసిటినిబ్' ఉత్పత్తికి ఎలి లిల్లీతో బీడీఆర్ ఫార్మా ఒప్పందం
'బారిసిటినిబ్' ట్యాబ్లెట్ల తయారీకి దేశీయ ఔషధ సంస్థ బీడీఆర్ ఫార్మా, బహుళ జాతి సంస్థ అయిన ఎలి లిల్లీతో 'వలంటరీ లైసెన్సింగ్' ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఔషధాన్ని కొవిడ్-19 బాధితులకు రెమ్‌డెసివిర్‌తో కలిసి ఇవ్వటానికి మనదేశంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) అత్యవసర అనుమతి ఇచ్చింది. దీంతో ఎలి లిల్లీ ఇప్పటికే పలు దేశీయ ఫార్మా కంపెనీలతో 'బారిసిటినిబ్' తయారీ- విక్రయ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటి వరకు ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లో సిప్లా, లుపిన్, సన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్, ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్, టోరెంట్ ఫార్మాసూటికల్స్ ఉన్నాయి.