కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇల్లు కదలకుండా చేస్తోంది. గతేడాది కొవిడ్ వ్యాపించిన దగ్గర నుంచి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఐటీ కంపెనీలతో పాటు.. అనేక ఇతర సంస్థలూ తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావద్దని సూచిస్తూ, ఎక్కడినుంచైనా పని చేసే వెసులుబాటు కల్పించాయి. పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయని భావించి.. హైబ్రిడ్ పద్ధతిలో పనిచేయాలని నిర్ణయించాయి. అంటే కొంతమంది కార్యాలయాల్లో, మరికొందరు ఇళ్లలో ఉండి పనిచేస్తుంటారు. కానీ.. కొవిడ్ వైరస్ రెండో దశ మరింతగా తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. దీంతో మళ్లీ ఇంటి నుంచి పని తప్పనిసరి అయ్యింది. ఇదే అదనుగా సైబర్ నేరస్థులు కీలక సమాచారాన్ని తస్కరించి, కోట్ల రూపాయలు ఆర్జించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఒక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2020లోనే లక్ష కోట్ల డాలర్ల సైబర్ నేరాలు జరిగాయని అంచనా.
ఈ ఏడాదిలోనూ 5000కు పైగా కేసులు
ఈ ఏడాదీ సైబర్ నేరాల సంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గత నాలుగున్నర నెలల్లో దాదాపు 5,258 సమాచార తస్కరణ కేసులు నమోదయ్యాయి. అమెరికాకు చెందిన వెరిజాన్ బిజినెస్ విడుదల చేసిన డేటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ 2021 ఈ సమాచారాన్ని వెల్లడించింది. 88 దేశాల్లో మొత్తం 29,207 కేసులను పరిశీలించి, ఈ నివేదికను విడుదల చేసింది.
- గత ఏడాదితో పోలిస్తే.. ఫిషింగ్ కేసులు 11%, రామ్‌సన్‌వేర్ కేసులు 6 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
- రహస్య సమాచారాన్ని తస్కరించడమూ ఇటీవల ఎక్కువయ్యింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు 61శాతం పెరిగింది.
- చాలా సంస్థలు తమ వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారంతో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య పెరిగిందని ఫిర్యాదు చేశాయి.
యాప్‌లతో జాగ్రత్త...
ఇప్పుడు అంతా డిజిటల్‌గా మారడంతో ప్రజలు ఎన్నో యాప్‌లను యధేచ్ఛగా వాడుతున్నారు. ప్రతి యాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటుంది. ముఖ్యంగా ఫోన్ నెంబర్లు, ఇ-మెయిల్ ఐడీలు, పుట్టిన తేదీ వివరాల్లాంటివి కచ్చితంగా అడుగుతుంటాయి. వీటి ఆధారంగా మనకు ఫోన్లు రావడం, ఫిషింగ్ మెయిల్స్‌ను పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మాయమాటలతో ప్రజల దగ్గర్నుంచి డబ్బు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి గుర్తింపు లేని ఫిన్‌టెక్ సంస్థల్లాంటివి ప్రజల బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తెలివిగా తెలుసుకుని, రూ.కోట్లలో కాజేస్తున్నాయి. ఈ విషయంలో ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించక తప్పదని బ్యాంకింగ్ ఐటీ నిపుణులు పేర్కొన్నారు.