కరోనా కారణంగా పెరిగిన డిజిటల్ లావాదేవీల వల్ల ఇటీవలి కాలంలో దేశంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోయాయని నిపుణులు అంటున్నారు. అయితే మహమ్మారి తర్వాత ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని సైబర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఐటీ పరిశ్రమకు తీవ్ర ఆందోళన కలిగించే రీతిలో ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు జరుగుతున్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. దక్షిణాది నగరాలైన చెన్నై, బెంగళూరులు సైబర్ దాడిలో ముందువరుసలో ఉన్నట్లు తేలింది.
ఈ విషయమై దిల్లీకి చెందిన సైబర్ నిపుణుడు ముకేశ్ చౌదరి స్పందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు.. మోసగించే పద్ధతులను కూడా మార్చుకున్నారని తెలిపారు.
'లాక్డౌన్ సమయంలో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని మరిన్ని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. మద్యం అమ్మకం, కొవిడ్ కేర్ వంటి పేర్లతో నకిలీ మొబైల్ అప్లికేషన్స్ సృష్టించి వీటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఐటీ హబ్‌లుగా పేరొందిన చెన్నై, బెంగళూరు నగరాల్లో సైబర్ మోసాలు అధికమవుతున్నాయి. కాబట్టి వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.'
- ముకేశ్ చౌదరి, సైబర్ నిపుణులు, దిల్లీ