తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2020, 7:37 PM IST

ETV Bharat / business

మార్చి 18న ఎస్​ బ్యాంక్ సేవలు పునరుద్ధరణ

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్​ బ్యాంక్ తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. బుధవారం(మార్చి 18) నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.

yes bank
ఎస్ బ్యాంక్

ఖాతాదారులకు ఎస్​ బ్యాంక్​ శుభవార్త తెలిపింది. బుధవారం(మార్చి 18) సాయంత్రం నుంచి అన్ని బ్యాంకింగ్ సర్వీసులు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. మార్చి 18న ఆర్​బీఐ మారటోరియం ఎత్తివేయనున్న నేపథ్యంలో అన్ని సర్వీసులు పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది.

"మార్చి 18 సాయంత్రం 6 గంటల నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరిస్తాం. మార్చి 19 నుంచి మా 1,132 బ్రాంచుల్లో.. ఏదైనా బ్రాంచీని సందర్శించి సేవలను వినియోగించుకోవచ్చు. డిజిటల్ ప్లాట్​ఫాంలు అందించే అన్ని సేవలను సైతం ఉపయోగించుకోవచ్చు."

-ఎస్ బ్యాంక్

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్​ బ్యాంక్​ను ఆదుకునేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. బ్యాంకు పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించంది. మారటోరియం ఎత్తివేతకు తొలుత ఏప్రిల్​ 3ను గడువుగా నిర్ణయించినప్పటికీ.. అనంతరం మార్చి 18కి కుదించింది.​

అయితే చెక్​ క్లియరింగ్​ సేవలపై మాత్రం నిషేధం కొనసాగనుంది. ఫారెక్స్​ కార్డులు ఉపయోగించే వినియోగదారులు సైతం ఈ సేవను ప్రస్తుతానికి వినియోగించుకోలేరని ఎస్ బ్యాంక్ తెలిపింది. ఆర్​బీఐ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాతే చెక్​ క్లియరింగ్ సేవలను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

మార్చి 5న మారటోరియం

ఎస్‌ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ మార్చి 5న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసింది. డబ్బు ఉపసంహరణపై ఖాతాదార్లకు నెలకు రూ.50,000 పరిమితి విధించింది. ఎస్‌ బ్యాంకు బోర్డును రద్దు చేసింది. పునరుజ్జీవ ప్రణాళికల్లో విఫలమవటం వల్ల బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details