CSR spending: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద గత ఏడేళ్ల (2014-15 నుంచి 2020-21)లో కంపెనీలు రూ.1.09 లక్షల కోట్లు వెచ్చించాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్‌సభకు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, పేదరిక నిర్మూలన, ఆహారాన్ని అందించడం, మహిళా సాధికారత, పదవీ విరమణ చేసిన సైనికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, గ్రామీణాభివృద్ధి, మురికివాడల్లో పరిస్థితులు మెరుగుపరచడం వంటి కార్యక్రమాల కోసం కంపెనీలు ఈ మొత్తాన్ని వెచ్చించాయన్నారు.
Mallya assets auction
మాల్యా, నీరవ్, చోక్సీ ఆస్తుల విక్రయంపై రూ.13,100 కోట్లు రికవరీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల ఆస్తుల విక్రయం ద్వారా బ్యాంకులు రూ.13,109.17 కోట్లు రికవరీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు చెప్పారు.
అదనపు వ్యయాలు రూ.3.73 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అదనంగా రూ.3.73 లక్షల కోట్ల వ్యయాలు చేసేందుకు సభ అనుమతి కోరుతూ మాట్లాడిన సందర్భంగా మంత్రి నిర్మల ఈ వివరాలు తెలిపారు. అదనపు వ్యయాల్లో రూ.62,000 కోట్లు ఎయిరిండియా బకాయిల చెల్లింపుల బాధ్యత చూసే ప్రత్యేక కంపెనీకి అందిస్తారు. రూ.58,430 కోట్లను ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా భరిస్తారు. రూ.53,123 కోట్లను ఎగుమతి ప్రోత్సాహకాల బకాయిలకు కేటాయిస్తారు. రూ.22,039 కోట్లను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధికి జమ చేస్తారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద కొవిడ్ పరిణామాల కోసం అదనంగా రూ.15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.
పీఎస్‌బీల రికవరీ రూ.5.49 లక్షల కోట్లు
నిరర్థక ఆస్తులను తగ్గించుకునేందుకు, పారు బకాయిల వసూలుకు ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ లోక్‌సభకు తెలిపారు. గత 7 ఆర్థిక సంవత్సరాల్లో పీఎస్‌బీలు రూ.5.49 లక్షల కోట్లు రికవరీ చేశాయని వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం స్థూల ఎన్‌పీఏలలో రికవరీల శాతం 2017-18లో 11.33 శాతంగా ఉండగా, 2019-20కి 14.69 శాతానికి మెరుగు పడింది. కొవిడ్ పరిణామాలతో తీవ్రంగా ఇబ్బంది పడిన 2020-21లోనూ ఇది 12.28 శాతంగా ఉందని మంత్రి వివరించారు.
duplicate pan card
దేశంలో ఇప్పటివరకు 12,12,527 డూప్లికేట్ పాన్‌కార్డులను ఏరివేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ఛౌద్రి లోక్‌సభకు చెప్పారు. స్వచ్ఛందంగా అప్పగించిన పాన్‌కార్డుల వివరాలను ప్రత్యేకంగా నిర్వహించలేదని వెల్లడించారు. పాన్‌కార్డు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులు, వస్తే చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'భాజపాకు త్వరలోనే చెడ్డ రోజులు.. ఇదే నా శాపం'