Crude oil price per barrel: చమురు ధరల విశ్వరూపం కొనసాగుతోంది. సోమవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఏకంగా 10 డాలర్లు పెరిగి 139.14 డాలర్లను తాకింది. 2008 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. అనంతరం నెమ్మదించి 125 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా క్రూడ్ (డబ్ల్యూటీఐ) బ్యారెల్ ధర కూడా 6.92 డాలర్లు పెరిగి 122.60 డాలర్లకు చేరింది. 2008 జులై నాటి అమెరికా క్రూడ్ బ్యారెల్ ధర 145.29 డాలర్లే ఇప్పటికీ గరిష్ఠస్థాయి. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడం, ఇరాన్ నుంచి ముడి చమురు ఎగుమతుల పునరుద్ధరణ ఆలస్యం కావొచ్చన్న అంచనాలు ధర భారీగా పెరిగేందుకు దోహదం చేసింది.
ఇదీ కారణమే: రోజూ 3.30 లక్షల బ్యారెళ్ల చమురును అందించే తమ 2 కీలక చమురు క్షేత్రాలను సాయుధ బృందం మూసివేసిందని లిబియాకు చెందిన చమురు కంపెనీ ప్రకటించడం కూడా చమురు ధరలు భగ్గుమనేందుకు కారణమయ్యాయి. రష్యా ఓడరేవుల నుంచి కజకస్థాన్ చేసే చమురు ఎగుమతులపైనా ఆంక్షల ప్రభావం కొంత మేర పడొచ్చు.
అమ్మో పసిడి: ముడి చమురు ధరల సెగతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు మాడిపోయాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే పసిడిపైకి పెట్టుబడులు మళ్లడంతో, ఔన్సు (31.10 గ్రాముల) ధర ఒకదశలో 2,000 డాలర్లను మించినా, భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయానికి 1980 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,700, కిలో వెండి రూ.71,600కు చేరింది.
ప్రత్యామ్నాయాలు ఇలా: చమురు సరఫరాలు మెరుగు పరచేందుకు వెనిజువెలాపై ఆంక్షల సడలింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతుల పునరుద్ధరణకూ చర్చలు నడుస్తున్నాయి. ఇవి సత్వరం అందుబాటులోకి రావడం కష్టమనే అభిప్రాయాన్ని జపాన్ పరిశ్రమ సంఘం వ్యక్తం చేసింది. జపాన్‌కు అధికంగా చమురు ఎగుమతి చేసే దేశాల్లో రష్యా ఐదో స్థానంలో ఉంది.
అంచనాలు ఇలా..
"రష్యా నుంచి దిగుమతులపై ఆంక్షలు విధించడం వల్ల రోజుకు 50 లక్షల బ్యారెళ్లు , అంతకుమించి ముడి చమురు సరఫరా లోటు ఏర్పడొచ్చు. ఇందువల్ల బ్యారెల్ చమురు ధర 200 డాలర్లకు చేరొచ్చు."
- బ్యాంక్ ఆఫ్ అమెరికా
బ్యారెల్ చమురు ధర ఈ ఏడాది 185 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.
- జేపీ మోర్గాన్