తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా సంక్షోభంతో ప్రమాదంలో క్రెడిట్‌ కార్డు రుణాలు: ఆర్బీఐ - క్రెడిట్​ కార్డు రుణాల వార్తలు హైదరాబాద్​

కొవిడ్‌ ప్రభావం బ్యాంకులపై భారీగా పడినట్లు ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. కరోనాతో ఆర్థికంగా చితికిపోవడం కారణంగా దాదాపు రూ.లక్ష కోట్ల మేర మొత్తం క్రెడిట్‌ కార్డుదారులు బ్యాంకులకు బకాయిపడినట్లు ఆర్బీఐ అంచనా వేసింది. ఈ మొత్తం వసూళ్లు అంత సులువుకాదని, తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే కార్డుదారుల నుంచి చెల్లింపులు ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా సంక్షోభంతో ప్రమాదంలో క్రెడిట్‌ కార్డు రుణాలు: ఆర్బీఐ
కరోనా సంక్షోభంతో ప్రమాదంలో క్రెడిట్‌ కార్డు రుణాలు: ఆర్బీఐ

By

Published : Oct 30, 2020, 8:47 PM IST

దేశ వ్యాప్తంగా ఆగస్టు చివరి నాటికి వివిధ బ్యాంకులు రూ.5.78 కోట్లకుపైగా క్రెడిట్‌ కార్డులు జారీ చేశాయి. ఇందులో క్రెడిట్‌ కార్డుదారులు వినియోగించుకుని చెల్లించని సొమ్ము రూ.లక్ష కోట్లు ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ముందే ఎన్‌పీఏలతో సతమతమవుతున్న బ్యాంకులకు.. ఇప్పుడు క్రెడిట్‌కార్డుల రుణాలు రూ.లక్ష కోట్ల మేర చెల్లింపులు జరగకపోవడం.. మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా అయింది.

క్రిడెట్‌ కార్డుల వాడకం ఎక్కువగా దిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయి, పుణె నగరాల్లో ఉంటుందని, కోల్​కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ఓ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. క్రెడిట్‌ కార్డుల్లో 93 శాతం షాపింగ్‌ల కోసం వాడుతున్నట్లు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న క్రెడిట్‌ కార్డుదారులు సగటున నెలకు రూ.యాభైవేల కోట్ల మేర ఖర్చు చేస్తారని ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ షాపింగ్‌ చేసేందుకే ఎక్కువగా వాడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అయితే కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోవడం, వ్యాపార, వాణిజ్య లావాదేవీలు స్తంభించడం వంటి కారణాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం వల్ల క్రెడిట్‌ కార్డులు వాడకున్నప్పటికీ తిరిగి చెల్లింపులు చేయలేకపోతున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా పరిస్థితులను అంచనా వేసిన క్రెడిట్‌ కార్డులు జారీ చేసే సంస్థలు అప్రమత్తమయ్యాయి. అదే విధంగా గతంలో కూడా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని ఖాతాదారులే ఈ మొండిబకాయిదారుల్లో ఎక్కువగా ఉన్నట్లు బ్యాంకు రికవరీ అధికారుల పరిశీలనలో తేలింది.

గతంలో రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన వారు, నిర్దేశించిన సమయంలో కాకుండా ఆలస్యంగా చెల్లించిన వారు అధికంగా ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. తెలంగాణలో అతి పెద్ద బ్యాంకు అయిన.. భారతీయ స్టేట్‌ బ్యాంకు నుంచి పొందిన క్రెడిట్‌ కార్డుదారుల్లో దాదాపు 15 నుంచి 30 శాతం వరకు ఉన్నట్లు రికవరీ విభాగానికి చెందిన అధికారులు తెలిపారు. గృహరుణాలు 90 శాతానికిపైగా చెల్లింపులు జరుగుతుండగా క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, వ్యక్తిగత, వాహన రుణాల ఈఎంఐలు చెల్లింపుల్లో కూడా కొంత వెనుకబాటు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆర్బీఐ ప్రకటించిన ఆరు నెలల మారిటోరియం అవకాశాన్ని గృహ రుణదారుల్లో చాలా తక్కువగా ఉపయోగించుకున్నారని.. మిగిలిన రుణాలకు చెందినవి ఎక్కువగా ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details