Credit card multiple offers: విదేశీ ప్రయాణాల్లో నగదు, ఫారెక్స్ కార్డు, ట్రావెలర్ చెక్కులు ఉన్నప్పటికీ.. క్రెడిట్ కార్డులూ కొన్ని ప్రయోజనాలను అందిస్తుంటాయి. క్రెడిట్ కార్డు ప్రయోజనాలను బ్యాంక్ బజార్ సీఈఓ అధిల్ శెట్టి వివరించారు. విదేశీ ప్రయాణాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించడం ఎంతో తేలిక. అవసరమైనప్పుడు నగదు తీసుకునే వీలుతో పాటు, కొనుగోళ్ల సమయంలో రివార్డులు, నగదు వెనక్కి, డిస్కౌంట్‌లు తదితరాలూ అందుతాయి.
సరైన కార్డుతో..
మార్కెట్లో అనేక రకాలైన క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. కార్డును బట్టి ప్రయోజనాలు ఉంటాయి. క్రెడిట్ కార్డును తీసుకునే ముందు, వాటిని పరిశీలించాలి. మీ అవసరాలకు ఏది నప్పుతుందో చూసుకోవాలి. లావాదేవీ రుసుము, ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే ఫీజు, రివార్డులు, రాయితీలు, మీరు వెళ్తున్న దేశంలో ఆ కార్డును ఎంత మేరకు అంగీకరిస్తారు అనే అన్ని వివరాలూ ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి.
వివరాలు చెప్పండి..
మీరు ప్రయాణం చేసేముందు.. మీ కార్డు సంస్థకు ఆ వివరాలు తెలియజేయండి. నెట్ బ్యాంకింగ్ లేదా యాప్ ద్వారా అంతర్జాతీయ లావాదేవీలను అంగీకరించేలా చేయడం, లేదా నిరోధించడం మీరే సొంతంగా చేసుకోవచ్చు. ఈ వెసులుబాటును మీరు అంగీకరించకుంటే కార్డు పనిచేయదు. లావాదేవీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే.. కార్డు సంస్థ అది మోసపూరితం అని భావించి, కార్డును తాత్కాలికంగా నిలిపి వేసే అవకాశం ఉంది. ఇలాంటి అనుభవం ఎదురైతే వెంటనే కార్డు సంస్థ వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేసి అన్‌బ్లాక్ చేసుకోవాలి.