Booster dose in india: కొవిషీల్డ్‌ను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు అనుమతులు ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)ను సీరం ఇన్స్టిట్యూట్ కోరింది. దేశంలో సరిపడా కొవిషీల్ట్ నిల్వలు ఉన్నాయని, దీంతో పాటు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నందున బూస్టర్ డోసుగా ఈ టీకాను ఉపయోగించాలని అభ్యర్థించింది. ఈ మేరకు సంస్థ రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్.. డీసీజీఐకి దరఖాస్తు చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన ఈ టీకాను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు యూకే వైద్య నియంత్రణ సంస్థ ఇప్పటికే అనుమతులు జారీ చేసిందని దరఖాస్తులో సీరం ఇన్స్టిట్యూట్ పేర్కొంది.
"ప్రపంచంలో మహమ్మారి పరిస్థితి తీవ్రంగానే ఉంది. చాలా దేశాలు బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించాయి. మన దేశంలోని పౌరులతో పాటు విదేశాల్లో కొవిషీల్డ్ తీసుకున్నవారంతా బూస్టర్ డోసు కావాలని అడుగుతున్నారు. దేశంలో కొవిషీల్డ్ టీకాలకు కొరత లేదు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఈ సమయంలో.. బూస్టర్ డోసు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి."
-సీరం లేఖ