త్వరగా అభివృద్ధి చేయాలనే ఒత్తిడి ఉన్నా, కొవిడ్ వ్యాక్సిన్‌ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల్లో, సురక్షితంగా, అందుబాటు ధరలో ఆవిష్కరిస్తామని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ కృష్ణ ఎల్ల చెప్పారు. ‘కొవిడ్ వ్యాప్తి విజృంభిస్తున్నందున, వ్యాక్సిన్‌ను త్వరగా ఆవిష్కరించాలనే ఒత్తిడి కంపెనీపై ఉంది. అయితే భద్రత, నాణ్యతలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోం’ అని కొవిడ్ వ్యాక్సిన్‌పై చెన్నై ఇంటర్నేషనల్ సెంటర్ సభ్యులతో జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన తెలిపారు. ‘అత్యున్నత ప్రమాణాల్లోనే క్లినికల్ పరిశోధనలు చేస్తున్నాం. అంతర్జాతీయ సంస్థలు, సమాజాలు కూడా మా పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కరణ మాకే కాదు.. దేశానికే ఎంతో ప్రతిష్ఠాత్మక అంశం. అందువల్ల పరిశోధనల్లో ఎంతమాత్రం రాజీపడం. నాణ్యమైన ఉత్పత్తిని మాత్రమే ఆవిష్కరిస్తాం’ అన్నారు. వ్యాక్సిన్ ఆవిష్కరణకు తేదీని వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
రోటావైరస్ తొలిదశకు 6 నెలలు..
‘రోటావైరస్ క్లినికల్ పరీక్షల తొలిదశ పూర్తికి 6 నెలల సమయం పడితే, కోవాక్జిన్ (భారత్ బయోటెక్ కొవిడ్-19 వ్యాక్సిన్) తొలిదశ పూర్తికి కేవలం 30 రోజులే పట్టింది. ఇప్పుడు రెండోదశ పరీక్షల్లోకి ప్రవేశించామ’ని కృష్ణ ఎల్ల వివరించారు. భారతీయ వ్యాక్సిన్ పరిశ్రమ ఐరోపా, అమెరాలకు చెందిన బహుళజాతి సంస్థలైన జీఎస్‌కే, సనోఫి కంటే వెనుకబడి లేవని, సాంకేతికత-క్లినికల్ పరిశోధనల్లో చైనా కంటే ఎంతో ముందున్నాయని తెలిపారు. ‘చాలామందికి భారతీయ కంపెనీల సామర్థ్యాలపై అనుమానాలున్నాయి. రోటావైరస్, పోలియో, మరికొన్ని వ్యాధులకు భారత్‌లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లతో వాటికి చక్కని సమాధానం చెప్పాం. క్లినికల్ పరీక్షలు, వ్యాక్సిన్ తయారీ ఎంతో మెరుగ్గా చేస్తున్నాం’ అని వివరించారు.