తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ4 ఫలితాలు, కరోనా పరిణామాలే కీలకం! - స్టాక్ మార్కెట్లపై క్యూ4 ఫలితాల ప్రభావం

స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకూ తీవ్రమవుతుండటం సహా.. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. 2020-21 క్యూ4 ఫలితాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపే ప్రధానాంశాలుగా చెబుతున్నారు.

stock market expectations for this week
ఈ వారం స్టాక్ మార్కెట్​ అంచనాలు

By

Published : Apr 25, 2021, 1:08 PM IST

2020-21 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసిక ఫలితాలు, కరోనా సంబంధిత వార్తలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ఏప్రిల్ నెల డెరివేటివ్​ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో ఈ వారం కూడా ఒడుదొడుకులకు అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం నేపథ్యంలో గత కొన్ని వారాలుగా సూచీలు భారీ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు.

విదేశీ సంస్థాగత పెట్టుడులు, ముడి చమురు ధరల ప్రభావంపై కూడా మదుపరులు దృష్టి సారించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్​ బ్యాంక్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్, టైటాన్, హెచ్​యూఎల్​, బజాజ్ ఆటో వంటి దిగ్గజ కంపెనీలు ఈ వారం..​ 2020-21 క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఫలితాల ప్రభావంపై ఆధారపడి ఆయా కంపెనీల షేర్లు స్పందించనున్నట్లు స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.

"ఫెడరల్ రిజర్వ్​ మానిటరీ పాలసీ నిర్ణయాలు, అమెరికా జీడీపీ గణాంకాలు కూడా ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే కీలక అంశాలు. ప్రపంచ మార్కెట్లన్నింటిపైన ఈ ప్రభావం ఉండనుంది."

-సిద్ధార్థ్​ ఖింకా, మోతీలాల్ ఓస్వాల్​ ఫినాన్సియల్ సర్వీసెస్​ పరిశోధనా విభాగాధిపతి

ఇదీ చదవండి:చిక్కుల్లో ఆర్థిక వ్యవస్థ.. పునరుద్ధరణ చర్యలే కీలకం

ABOUT THE AUTHOR

...view details