తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్య రంగాల్లో ఐటీ ముందజలో ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం ఆరున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఈరంగంపై ఆధారపడిన అనుబంధ రంగాలతో కలిపి మొత్తంగా 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంతటి ప్రాధాన్య రంగం ఇప్పుడు ఇంటి నుంచి పనికి పరిమితమైంది. గత రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నా.. ప్రొడక్టివిటీ, ఎగుమతులు ఏమాత్రం తగ్గకపోగా జాతీయ సగటును మించిన వృద్ధిని రాష్ట్ర ఐటీరంగం సాధించింది. ఈ ఏడాది ఐటీ రంగం 12.98 శాతం వృద్ధి సాధించింది. ఎగుమతులు సైతం లక్ష 45 వేల 522 కోట్లకు పెరిగాయి. 2020-21 సంవత్సరానికి గాను ఐటీ రంగం, అనుబంధ సేవల ద్వారా 7.99 శాతం ఉద్యోగిత పెరిగింది. ఏడాది కాలంలో కొత్తగా 46 వేల 489 ఉద్యోగాలను ఐటీ రంగం కల్పించింది. తద్వారా రాష్ట్రంలో మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 6 లక్షల 28 వేల 615 కు చేరుకుంది. గతేడాది కాలంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్, మాస్ మ్యూచువల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయి.
హైదరాబాద్‌లోనే మెరుగ్గా పరిస్థితులు
కొవిడ్ మొదటి వేవ్ నుంచి ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ రెండేళ్ల తర్వాత కూడా కంపెనీల నుంచి పని చేసే ఉద్యోగులు 3 నుంచి 5 శాతానికే పరిమితమయ్యారు. ఐటీ వృద్ధి అధికంగా ఉండే బెంగళూరు, చెన్నై నగరాల కన్నా.. హైదరాబాద్‌లోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ ఆంక్షల సడలింపుతో చిన్న, మధ్యతరగతి కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు ఆహ్వానించగా.. పెద్ద కంపెనీలు, జీఐసీ కంపెనీలు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. అయితే కంపెనీలన్నీ జులై మొదలుకొని ఈ ఏడాది డిసెంబర్ కల్లా 75 శాతం వర్క్ ఫోర్స్‌తో ఆపరేట్ చేయాలని యాజమాన్యాలు సంకల్పించాయి. ప్రస్తుతం థర్డ్ వేవ్ భయాలు, డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచేందుకు కంపెనీలు పునరాలోచనలో పడినట్లు నిపుణులు తెలిపారు. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చే ప్రాతిపదిక వ్యాక్సినేషన్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుందని.. ఈ అక్టోబర్ కల్లా ఐటీ ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేసేందుకు ఐటీ కంపెనీలు చొరవ తీసుకున్నాయని వారంటున్నారు.
హైబ్రిడ్ మోడల్‌ను అవలంభించేందుకు..