దేశీయ అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైన లుపిన్ లిమిటెడ్.. కొవిడ్-19 ఔషధాలు, టీకాను పెద్దఎత్తున అందించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం విదేశీ భాగస్వామ్యాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 'మెర్క్, ఫైజర్ సంస్థల వద్ద కొవిడ్-19 ఔషధాలు ఉన్నాయి. వాటిని భారత విపణిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం' అని లుపిన్ లిమిటెడ్ ఎండీ నీలేశ్ గుప్తా తెలిపారు. కొవిడ్-19 టీకా తయారీకి నాగ్‌పుర్‌లోని తమ యూనిట్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 'మేం ఇంతవరకూ టీకాల తయారీలో లేం. కానీ, నాగ్‌పుర్‌లో మాకొక యూనిట్ ఖాళీగా ఉంది. దాన్ని సిద్ధం చేసి టీకాల తయారీకి వినియోగించవచ్చు' అన్నారాయన.
యాంటీ-వైరల్ ఔషధమైన రెమ్‌డెసివిర్ తయారీకి అనుమతి కోరుతూ తాము పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు నీలేశ్. పేటెంట్ హక్కులపై తమకు గౌరవం ఉందని.. అందువల్ల ఈ ఔషధానికి సంబంధించి 'వాలంటరీ లైసెన్స్' కోసం గిలీడ్ సైన్సెస్‌తో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నామని అన్నారు. ఎలి లిల్లీతో వాలంటరీ లైసెన్స్ ఉన్నందున 'బారిసిటినిబ్' ఔషధాన్ని రెండు మూడు నెలల్లో దేశీయ విపణిలో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. కొవిడ్-19 బాధితులకు పలు రకాల స్టెరాయిడ్లను వైద్యులు సిఫారసు చేస్తున్న నేపథ్యంలో.. తాము స్టెరాయిడ్ ఔషధాల తయారీని పెంచుతున్నట్లు నీలేశ్ గుప్తా వివరించారు.