కొవిడ్-19 సెకండ్ వేవ్‌లో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తున్న బాధితుల సంఖ్య అధికంగా ఉంది. ఇటువంటి వారికి ఆక్సిజన్ సరఫరా చేయటంతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గించటం కోసం ‘రెమ్‌డెసివిర్’ ఇంజక్షన్‌ను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. రోగికి తొలిరోజు రెండు ఇంజక్షన్లు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు రోజుకు ఒకటి చొప్పున... మొత్తం ఆరు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. బాధితుల సంఖ్య పెరిగిపోవటంతో దీనికి గిరాకీ గత రెండు మూడు వారాలుగా విపరీతంగా పెరిగింది. దీంతో కొరత ఏర్పడటం, దాన్ని బ్లాక్‌మార్కెటీర్లు సొమ్ము చేసుకోవటం, బాధితులు మందు కోసం ఇబ్బందులు పడటం తెలుస్తూనే ఉంది. ‘రెమ్‌డెసివిర్’ ఇంజక్షన్‌పై పేటెంట్ హక్కులు యూఎస్ కంపెనీ అయిన గిలీడ్ సైన్సెస్‌కు ఉన్నాయి.
వాలంటరీ లైసెన్సింగ్
ఈ సంస్థలు దీనికి సంబంధించి మనదేశంలోని ఏడు ఫార్మా కంపెనీలతో ‘వాలంటరీ లైసెన్సింగ్’ ఒప్పందాలు చేసుకుంది. అందువల్ల ఈ ఆరు కంపెనీలు మాత్రమే మనదేశంలో దీన్ని తయారు చేసి సరఫరా చేస్తున్నాయి. కానీ ఈ కంపెనీలు తయారు చేసే మందు ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. ఒక్కో రాష్ట్రానికి ఎన్ని ఇంజక్షన్లు సరఫరా చేయాలనే కోటా నిర్ణయించి...., దాని ప్రకారం మందు సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పైగా ధర కూడా అధికంగా ఉంది. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.3,500 వరకూ ఫార్మా కంపెనీలు విక్రయిస్తున్నాయి. అదే బ్లాక్‌మార్కెట్‌లో దాన్ని కొనుగోలు చేయాలంటే రూ.25,000 వరకూ చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘రెమ్‌డెసివిర్’ తయారీని పెంచటం, అందుకు ఇతర కంపెనీలకు సైతం అవకాశం ఇవ్వటం ఒక్కటే పరిష్కారమనే అభిప్రాయం సంబంధిత వర్గాల్లో వినిపిస్తోంది.