కరోనా మూడో దశ (Corona Thirdwave) ముప్పు పొంచి ఉన్న వేళ వీలైనంత వేగంగా అర్హులైన వారందరికీ టీకాలు(Vaccination) ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇకపై వాట్సాప్‌లోనూ టీకా స్లాట్‌ను (Vaccine Registration) బుక్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"పౌరుల సేవలో కొత్త శకానికి నాంది పలుకుతున్నాం. ఇక కరోనా వ్యాక్సిన్ స్లాట్లను అత్యంత సులువగా మీ ఫోన్‌లోనే క్షణాల్లో బుక్ చేసుకోవచ్చు." అని కేంద్రమంత్రి ప్రకటించారు. దీంతో పాటు వాట్సాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో కూడా వివరించారు. అటు మై గవర్న్‌మెంట్ ఇండియా ట్విట్టర్ ఖాతాలోనూ ఈ కొత్త సదుపాయం గురించి ట్వీట్ చేశారు.
మరి వాట్సాప్ ద్వారా టీకా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..
- ఇందుకోసం ముందు My Gov India Corona Helpdesk నంబరు 91-9013151515ను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వాట్సాప్‌లో ఈ నంబరుకు 'Book Slot' అని మెసేజ్ పంపాలి.
- అప్పుడు మీ ఫోన్ నంబరుకు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నంబరు వెరిఫై చేసుకోవాలి.
- ఆ తర్వాత తేది, లొకేషన్, పిన్‌కోడ్, వ్యాక్సిన్ టైప్ తదితర వివరాలను నింపాలి.
- అన్నీ పూర్తయ్యాక Confirm చేస్తే మీకు స్లాట్ బుక్ అవుతుంది.