ప్రస్తుత స్టాక్ మార్కెట్ల దూకుడుకు, ఆర్థిక రికవరీకి ఎటువంటి సంబంధం లేదని.. వృద్ధిపై హేతుబద్ధత లేని అంశాల ప్రభావం ఉండొచ్చని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కరోనా వల్ల ప్రభావిత రంగాలకు రెండో దఫా ఉద్దీపన ప్యాకేజీ కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. రుణ వాయిదాలపై ఆరు నెలల మారటోరియం ముగిస్తే.. సెప్టెంబరు తర్వాత బ్యాంకులు నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)ను అధికంగా చూపించే అవకాశం ఉందని హెచ్చరించారు. కొవిడ్-19 మహమ్మారి ప్రారంభంలో మార్కెట్లు దాదాపు 20 శాతం కుప్పకూలాయి. అయితే గత కొన్ని వారాల్లో బలంగా పుంజుకున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ మైనస్‌లోకి వెళ్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నప్పటికీ.. మార్కెట్లు గణనీయంగా లాభపడటం గమనార్హం. మార్కెట్లు, ఆర్థిక రికవరీకి అతి చిన్న సంబంధం ఉందని, ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిన నగదు లభ్యత కొంత కలిసొస్తుందని ఆర్థికవేత్తలు తెలిపారు. మంచి ఆర్థిక వ్యవస్థను లాభాలిస్తున్న మార్కెట్లు ప్రతిబింబించవని అన్నారు. ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించింది. అయితే వాస్తవ వ్యయం ప్యాకేజీలో పదోవంతు మాత్రమే అని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.