కరోనా వైరస్ చికిత్స కోసం భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్ కొత్త ఔషధాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే మరో డ్రగ్ 'రెమిడెసివిర్'కు అనుమతులు లభించాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ యాంటీవైరల్ ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) నుంచి తయారీ, మార్కెటింగ్ అనుమతులు పొందాయి దేశీయ ఫార్మా సంస్థలు హెటెరో, సిప్లా.
కొవిడ్-19 బారినపడి తేలికపాటి లేదా ఓ మోస్తరు స్థాయిలో బాధపడుతున్న వారికి పరిమిత అత్యవసర వినియోగం (రిస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీ యూస్) కోసం రెమిడెసివిర్‌కు డీసీజీఏ అనుమతులు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే.. రెమిడెసివిర్ వినియోగంపై ప్రతి రోగి రాతపూర్వక అనుమతితో పాటు అదనపు క్లినికల్ ట్రయల్స్, మార్కెటింగ్ నిఘా సమాచారం వంటి నివేదిక సమర్పించాలని తెలిపారు.
కేంద్ర ఆరోగ్య శాఖ 'క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ కోవిడ్-19'లో భాగంగా అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు అధికారులు. తీవ్రమైన మూత్రపిండ, కాలేయ వ్యాధులతో బాధపుడుతున్నవారు, గర్భిణీలు, పాలిచ్చే మహిళలు, 12 ఏళ్లలోపు వయస్సు వారికి ఈ మందును వినియోగించకూడదని సూచించారు.