కొవిడ్-19 ఔషధాలు, వ్యాక్సిన్ అన్ని దేశాలకు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. ఎక్కువ బిడ్డింగ్ వేసేవాళ్లకు కాకుండా అవపరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ చేరాలని ఆయన సూచించారు. అసమానతలు చోటుచేసుకుంటే కరోనా వైరస్ మహమ్మారి మరింత కాలం ఉంటుందని హెచ్చరించారు. అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ కొవిడ్-19పై ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో గేట్స్ పాల్గొన్నారు.
'మార్కెట్ శక్తులు కాకుండా సమానత్వం ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా కఠిన నిర్ణయాలు తీసుకొనే నాయకులు మనకు కావాలి. అవసరమైన ప్రజలు, ప్రాంతాలకు కాకుండా ఎక్కువ డబ్బులు చెల్లించేవారికి వ్యాక్సిన్ దొరికితే మహమ్మారి మరింత కాలం కొనసాగుతుంది. ఇంకా ప్రమాదకరంగా మారుతుంది' అని గేట్స్ హెచ్చరించారు. ఎయిడ్స్ ఔషధాలు అందరికీ అందుబాటులోకి వచ్చినట్టే కొవిడ్‌కూ రావాలని కోరుకున్నారు.