భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేస్తున్న 'కొవాగ్జిన్' పూర్తిగా సురక్షితమని, దీని ఫలితాలపై 200 శాతం పారదర్శకంగా ఉంటున్నామని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. మా వాలంటీర్ల రక్షణ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నియంత్రణ సంస్థలకు వ్యాక్సిన్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్నీ ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు వెల్లడించారు.
'కొవాగ్జిన్ పూర్తిగా సురక్షితం-200% పారదర్శకంగా ఉంటున్నాం' - కరోనా వాక్సిన్
కొవాగ్జిన్ పూర్తిగా సురక్షితమని తెలిపారు భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల. వ్యాక్సిన్ పరీక్ష ఫలితాలపై 200 శాతం పారదర్శకంగా ఉంటున్నామన్నారు. వలంటీర్ల రక్షణ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, నియంత్రణ సంస్థలకు సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు వెల్లడించారు.
శనివారం ఫిక్కీ వార్షిక సదస్సు కొవాగ్జిన్‌పై కీలక విషయాలు పంచుకున్నారు డాక్టర్ కృష్ణ ఎల్ల. 1, 2 దశల క్లినికల్ పరీక్షల ఫలితాల నేపథ్యంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి కోరినట్లు పేర్కొన్నారు. మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం ఇప్పటికే 8,000 మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం టీకాను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. టీకా నిరూపితమైన సాంకేతికత ఆధారంగానే టీకాను ఉత్పత్తి చేశామని, దీన్ని ఆరు నెలల వయసు నుంచి 60 ఏళ్ల వారికి ఇవ్వొచ్చని తెలిపారు. ప్రారంభంలో చేసిన క్లినికల్ ట్రయల్స్ ఆధారంగానే రష్యా, చైనాలు వ్యాక్సిన్లకు అనుమతిని ఇచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. 'కొవాగ్జిన్'పై ప్రస్తుతం చేస్తున్న మూడో దశ క్లినికల్ పరీక్షలు భారతదేశంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది తొలి సమర్థమైన క్లినికల్ ట్రయల్ అని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'టెక్నాలజీ సాయంతో వ్యాపార రంగంలో సరికొత్త మార్పులు'