2019-20 ఆర్థిక సంవత్సరంలోని జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక లోటును పూడ్చుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగా వ్యయాన్ని కట్టడి చేయాలని నిర్ణయించింది. చివరి త్రైమాసికంలో వ్యయం 25 శాతానికి మించకుండా అంచనాలను సిద్ధం చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం సూచించింది. మొదటి రెండు నెలల్లో 15శాతం.. చివరి నెల 10 శాతం ఖర్చు మించకుండా చూసుకోవాలని పేర్కొంది. ఇదివరకు అనుమతి పొందిన పనులకు బడ్జెట్ ఎక్కువ అయితే ఆ నిధుల కోసం పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అని.. అన్ని శాఖల మంత్రులు, విభాగాలు ఈ మార్గ దర్శకాలను పాటించాలని ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం తన ఆదేశాల్లో వివరించింది.
3.3 శాతం ఆర్థిక లోటు..
2017లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఆ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 33 శాతం నుంచి 15 శాతానికి వ్యయాన్ని పరిమితం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతం ఆర్థిక లోటు ఉంది.