కరోనా వైరస్ ప్రభావం... దేశంలో పర్యటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి పొందుతున్న 3 కోట్ల 80లక్షల మందిపై పడే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ.... భారత పర్యటక, ఆతిథ్య రంగ సమాఖ్య ప్రధాని మోదీకి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా 5కోట్ల 50 లక్షల మంది ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, కార్యకలాపాలు తగ్గిపోవటం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కానీ అందులో 70శాతం అంటే.... 3 కోట్ల 80లక్షల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని లేఖలో తెలిపింది.
మొత్తం పర్యటక కార్యకలాపాల్లో 28 బిలియన్ డాలర్‌లు.... దేశీయంగా 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ప్రమాదంలో పడిందని వివరించింది. దీని ద్వారా 5లక్షల కోట్ల రూపాయల రాబడి ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈరంగాలపై ఆధారపడిన ఉద్యోగులు, కార్మికులకు జీతాలు, సేవలు అందించేందుకు తోడ్పాటునివ్వాలని... భారత పర్యటక, ఆతిథ్య రంగ సమాఖ్య లేఖలో పేర్కొంది.